బన్నీ ఉత్సవం: కర్రలతో సమరం

2024-10-13 01:55:34.0

70 మంది గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

https://www.teluguglobal.com/h-upload/2024/10/13/1368504-bunny-festival.webp

దసరా సందర్భంగా కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా పలు గ్రామాల ప్రజలు మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి కర్రలతో తలపడుతారు. సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది కూడా బన్నీ ఉత్సవాన్ని నిర్వహించారు. అయితే ఆదివారం తెల్లవారుజామున జరిగిన కర్రల సమరంలో హింస చెలరేగింది. కర్రలతో ఇరువర్గాల ప్రజలు కొట్టుకోవడంతో 70 మంది గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.

దేవరగట్టులో దాదాపు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. స్వామి దేవతామూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్‌, విరుపావురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడుతారు. ఈ నేపథ్యంలో కొందరు గాయపడుతుంటారు. వారిని స్థానిక వైద్య శిబిరంలో చేరుస్తారు. విషమయంగా ఉంటే పట్టణానికి తరలిస్తారు. చిన్న గాయాలైతే పసుపు రాసుకుని వెళ్లిపోతారు.

ఉత్సవాల కోసం వచ్చి మృత్యుఒడికి

మరోవైపు కర్నూలు జిల్లా ఆలూరు మండలం కరిడిగుడ్డం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ అదపుతప్పి కిందపడటంతో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతులు కర్ణాటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దేవరగట్టులో దసరా బన్నీ ఉత్సవాలు చూడడానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.