‘బలగం’ మొగిలయ్య కన్నుమూత

 

2024-12-19 05:34:41.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/19/1387192-mogilaiah.webp

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

జానపద కళాకారుడు ‘బలగం’ మొగిలయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బలగం సినిమా ద్వారా ఆయన గుర్తింపు పొందారు. మొగిలయ్య స్వగ్రామం వరంగల్‌ జిల్లా దుగ్గొండి.

బలగం సినిమాలో గ్రామీణ నేపథ్య పాటలతో ఆయన ఆకట్టుకున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమాకు క్లైమాక్స్‌ సీన్‌ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. క్లైమాక్స్‌లో మొగిలయ్య భావోద్వేగభరితంగా పాట పాడి ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సినిమాకు అదే హైలెట్‌. ఈ మూవీ సక్సెస్‌తో ఆయనకు గుర్తింపు వచ్చింది. కొన్నిరోజులుగా మొగిలయ్య కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు చికిత్స కోసం మెగాస్టార్‌ చిరంజీవి, బలగం మూవీ డైరెక్టర్‌ వేణు ఆర్థిక సాయం చేశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను వరంగల్‌లోని సంరక్ష హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.

మొగిలయ్య కుటుంబానికి తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. పొన్నం సత్తయ్య అవార్డు అందుకున్న మొగిలయ్య దంపతులకు ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చారు. మొగిలియ్య మరణంతో ఆయన స్వగ్రామం దుగ్గొండిలో విషాదఛాయలు అలుముకున్నాయి. బలగం డైరెక్టర్‌ వేణు, నిర్మాత దిల్‌ రాజు సంతాపం వ్యక్తం చేశారు.

సీఎం సంతాపం

తెలంగాణ జానపద కళాకారుడు పస్తం మొగిలయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బేడ బుడగ జంగాల జానపద కళారూపం ‘శారద కథల’కు బహుళ ప్రాచుర్యం కల్పించి, ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు.

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య శారద తంబుర మీటుతూ, పక్కనే బుర్ర (డక్కీ) వాయిస్తూ వారి సతీమణి కొమురమ్మ పలుచోట్ల ఇచ్చిన అనేక ప్రదర్శనలు వెలకట్టలేనివని, తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన “బలగం” సినిమా చివర్లో వచ్చే మొగిలయ్య పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని గుర్తుచేశారు.

ఈ బాధాకర సమయంలో పస్తం మొగిలయ్య సతీమణి కొమురమ్మ గారితో పాటు వారి కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు

 

Padma Shri Awardee,Balagam Movie Mogilaiah,Passes Away,Emotional performance,Balagam movie