2016-04-16 03:18:05.0
కదులుతున్న బస్‌లు ఈ మధ్యకాలంలో మహిళల పాలిట కాలయముళ్లలా మారుతున్నాయి. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన డ్రైవర్, కండక్టర్లు మహిళలకు తమలోని అపరిచితులను పరిచయం చేస్తున్నారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఒక బెంగలూరు మహిళ ఛేంజ్ డాట్ ఆర్గ్‌లో తన పిటీషన్‌ని పోస్ట్ చేసింది. నాలుగురోజుల్లో 42వేలమంది ఆమెకు ఆన్‌లైన్‌లో తమ మద్ధతుని ప్రకటించారు. ప్రయివేటు వాహనాలు నడిపే సంస్థలు తమ సంస్థలో పనిచేసే డ్రైవర్ కండక్టర్ లను గురించి పూర్తిగా తెలుసుకోవాలని, వారి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/04/redbus1.gif
కదులుతున్న బస్‌లు ఈ మధ్యకాలంలో మహిళల పాలిట కాలయముళ్లలా మారుతున్నాయి. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన డ్రైవర్, కండక్టర్లు మహిళలకు తమలోని అపరిచితులను పరిచయం చేస్తున్నారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఒక బెంగలూరు మహిళ ఛేంజ్ డాట్ ఆర్గ్‌లో తన పిటీషన్‌ని పోస్ట్ చేసింది. నాలుగురోజుల్లో 42వేలమంది ఆమెకు ఆన్‌లైన్‌లో తమ మద్ధతుని ప్రకటించారు.
ప్రయివేటు వాహనాలు నడిపే సంస్థలు తమ సంస్థలో పనిచేసే డ్రైవర్ కండక్టర్ లను గురించి పూర్తిగా తెలుసుకోవాలని, వారి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆమె తన పిటీషన్లో డిమాండ్ చేసింది. ఈ మహిళ ఫిబ్రవరి 18న గోవానుండి బెంగలూరుకి ప్రయాణం చేస్తూ డ్రైవర్ కారణంగా తీవ్ర అవమానం ఎదుర్కొంది. రెడ్ బస్ యాప్ ద్వారా ఆమె టికెట్ ని బుక్ చేసుకుంది. ప్రయాణ సమయంలో బస్‌లో లాస్ట్ సీటులో నిద్రపోయింది. లాస్ట్ స్టాప్ వచ్చాక ఆమెని నిద్ర లేపేందుకు వచ్చిన డ్రైవర్, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె శరీరంలోని ప్రయివేటు భాగాలను తాకుతూ నిద్రలేపాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచిన ఆమెకు ఏం జరిగిందో అర్థం కాలేదు.
అప్పటికి కిందికి దిగిపోయిన ఆ మహిళ తరువాత తనకు జరిగిన అవమానానికి తగిన విధంగా స్పందించింది. తాను ప్రయాణం చేసిన సీ బర్డ్ బస్ కంపెనీకి, రెడ్ బస్‌కీ ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. సీ బర్డ్ కొన్ని రోజుల తరువాత… ఆ డ్రైవర్‌ని పోలీసులకు అప్పగించామంటూ ఒక్క లైన్లో సమాధానం ఇచ్చింది. రెడ్ బస్ ఆన్‌లైన్ బస్‌బుకింగ్ సంస్థ ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని…ఇంకా ఈ తరహా సమాధానాలే చెప్పుకొచ్చింది. బస్‌ల్లో మహిళల రక్షణ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామంది. మహిళా ప్రయాణీకులకు వారి రక్షణకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సమాచారం అందిస్తామని, బస్‌లో మొత్తం ఎంతమంది మహిళలు ఉన్నారు అనే విషయాన్ని సైతం మహిళా ప్రయాణీకులకు చెబుతామని రెడ్‌బస్ పేర్కొంది.
రెడ్ బస్ కంపెనీ ఆ మహిళకు ఇచ్చిన సమాధానాల్లో…. మీరు ప్రయాణం చేశారు కనుక…సీ బర్డ్ బస్ కంపెనీ మీ టికెట్ డబ్బుని వాపసు ఇవ్వనంది…అనే సమాధానం కూడా ఉంది. తాను ఆశిస్తున్న భద్రతకు, తన ఆవేదనకు ఏమాత్రం సంబంధంలేని ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ మహిళ… రెడ్ బస్ స్పందన హాస్యాస్పదంగా ఉందంది.