2025-01-09 09:53:58.0
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మందు బాబులపై పోలీసులు ఆంక్షలు విధించారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నెలరోజుల పాటు పోలీసులు ఆంక్షలు విధించారు. జనవరి 11 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిషేధం విధిస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు ప్రకటించారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారితో మహిళలు, మరి ముఖ్యంగా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ సుధీర్ బాబు తెలిపారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారిని మందుబాబులు మానసికంగా వేధిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు.
మందుబాబుల చేష్టల వల్ల వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందన్నారు. కొంతమంది వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం సేవించి, సైకోల్లా ప్రవర్తిస్తూ మహిళలు, పిల్లల్లో భయాందోళన కలిగిస్తున్నారని సీపీ తెలిపారు. ఈ క్రమంలో మహిళలు, పిల్లలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే నెల రోజుల పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధం విధిస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
CP Sudhir Babu,Rachakonda Police Commissionerate,alcohol,Telangana police,CM Revanth reddy,DGP Jitender,Whines,Congress party,KTR