http://www.teluguglobal.com/wp-content/uploads/2015/04/Lokesh.jpg
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తుళ్ళూరును ఎంపిక చేసినప్పటి నుంచి చంద్రబాబుకి సమస్యలు ప్రారంభమయ్యాయి. మామూలుగా అయితే ప్రతిపక్షం నుంచి ప్రతిఘటన ఎదురుకావాలి. కాని జగన్ ఎందుకో రాజధాని భూముల వ్యవహారంలో తప్పించుకు తిరుగుతున్నాడు. స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉద్యమించడానికి ప్రయత్నించినా పోలీసుల బూట్లల్లో చంద్రబాబు కాళ్ళుపెట్టి ఉక్కుపాదంతో అణచివేశాడు. ఎక్కడ ఏం తగలబడ్డా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు జైళ్ళకెళ్ళాల్సిన వాతావరణంలో పోతే పొలమే పోనీ, లాఠీ దెబ్బలు తిని పరువు పోగొట్టుకోవడమెందుకని దీనంగా ఉండిపోయారు. చంద్రబాబుని, నారాయణని, […]
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తుళ్ళూరును ఎంపిక చేసినప్పటి నుంచి చంద్రబాబుకి సమస్యలు ప్రారంభమయ్యాయి. మామూలుగా అయితే ప్రతిపక్షం నుంచి ప్రతిఘటన ఎదురుకావాలి. కాని జగన్ ఎందుకో రాజధాని భూముల వ్యవహారంలో తప్పించుకు తిరుగుతున్నాడు. స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉద్యమించడానికి ప్రయత్నించినా పోలీసుల బూట్లల్లో చంద్రబాబు కాళ్ళుపెట్టి ఉక్కుపాదంతో అణచివేశాడు. ఎక్కడ ఏం తగలబడ్డా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు జైళ్ళకెళ్ళాల్సిన వాతావరణంలో పోతే పొలమే పోనీ, లాఠీ దెబ్బలు తిని పరువు పోగొట్టుకోవడమెందుకని దీనంగా ఉండిపోయారు. చంద్రబాబుని, నారాయణని, పుల్లారావు లాంటి వాళ్ళను అంట్లుతోమేసినట్లు తోమేసిన “బోయపాటి ఉషారాణి” లాంటి స్త్రీలు కూడా అధికారం షాక్కి మీడియా ముందు ఇష్టంగా భూములు అప్పగించేశారు. మెగా మేధావి జయప్రకాష్‌నారాయణ బంగారు పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మించడమేమిటని ఓ ప్రకటన ఇచ్చేసి పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో కూరుకుపోయాడు.
ఏ ప్రకటనా ఇవ్వకపోతే ఎవరైనా విలేకరులు ప్రశ్నిస్తారనుకున్నారేమో కమ్యూనిస్టులు కూడా ఎప్పటిలాగే తీవ్రంగా ఖండించి చేతులు దులిపేసుకున్నారు. ప్రజల పక్షాన పోరాడే ఒంటరి మేధావులు కొందరు “హిందూ” లాంటి ప్రతికల్లో ఏటా నాలుగు పంటలు పండే భూముల్లో రాజధాని కట్టడమేమిటని ప్రశ్నించారు. మేధాపాట్కర్ ఆంధ్రా ధాన్యాగారాన్ని నాశనం చెయ్యవద్దు బంజరు భూముల్లో రాజధాని కట్టుకొమ్మని చెప్పింది. ఇదే విషయాన్ని ఇంకో విధంగా ఉత్తరం రాశాడు అన్నాహజారే. చంద్రబాబుకి చాలా కోపం వచ్చింది. వీళ్ళిద్దరి మీదా.
ఆంధ్ర రాజధాని పేరుతో ఇంత విధ్వంసం జరుగుతున్నా నేషనల్ మీడియాలో “ఇష్యూ” కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. లోకల్ మీడియాలో రైతులు ఆనంద బాష్పాలు కారుస్తూ ఎలా భూములు అప్పగించారో ఫోటోలతో సహా కథనాలు వచ్చేలా కోటరీ చూసుకుంది. కావాల్సిన 30 వేల పై చిలుకు ఎకరాల భూమీ స్వాధీనం అయిందని మంత్రి వర్యులూ ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. అయినా ఎందుకో తెలియదుగానీ బహుశా చంద్రబాబు చేస్తున్న ఈ రాజధాని మహా యజ్ఞంలో సమిధలా తన భూమిని ఇవ్వలేక పోయానని కొందరు రైతులు తర్వాత బాధ పడతారో ఏమోనని భూసేకరణ గడువును పెంచుకుంటూ పోతున్నారు. జగన్ దయ వల్ల లోకల్‌గా సమస్యలు ఏం లేవు గాని అన్నాహజారే ఉత్తరం రాయడం, మేధాపాట్కర్ ఉపన్యాసం – అది లోకల్ మీడియాలో ఎక్కడా రాకుండా చూసుకున్నారు. కానీ ఎక్కడో కొద్దిగా పొరపాటు జరిగి బయటకు పొక్కింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంత పనికి మాలిన వాళ్ళో పుంఖాను పుంఖంగా కథనాలు వండి వార్చొచ్చుగానీ, అంతకు ముందే వాళ్ళెంత గొప్పవాళ్ళో, వాళ్ళు ఎంత గొప్పగా బాబుని మెచ్చుకున్నారో సీరియల్‌గా రాసి ఉండడం వల్ల జనం వాటిని మర్చిపోక ముందే వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తే గాలి వాటానికి తమ ముఖాల మీదే పడుతుందని భయంతో, రగిలిపోతున్నారు. వీటికితోడు నాలుగు పంటలు పండే భూముల్ని బలవంతంగా లాక్కోవడమేమిటని కొందరు మాజీ న్యాయ మూర్తులు కూడా కోర్టులకెక్కారు. కోర్టులు కూడా రైతుల పక్షపాతిలాగానే కనిపిస్తున్నాయి.
అంతా అయిపోయింది. రాజధాని నిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. రాజధానిని నిర్మించుకోవడానికి ఇంజనీర్లకి గతిలేని దేశంలో సింగపూర్ ఇంజనీర్లు వచ్చి ఊహా సౌధాలు నిర్మించబోయే తరుణంలో చంద్రబాబుకి అంత కోపం ఎందుకొచ్చింది?
ఇలాంటి పంట భూములు పోతే అనేక రకాల పంటలకి కొరత వస్తుందని తెలియదా? ఇక్కడ సేద్యం లేకపోతే వేలాది మంది కౌలు రైతులు, కూలీలు బజారున పడతారని తెలియదా? రెండెకరాల ఆసామి చంద్రబాబుకి ఒక్కసారి బాల్యాన్ని నెమరేసుకుంటే ఇంతకన్నా ఎక్కువ బాధలు తెలుసు.
అయినా ఎందుకు అంత పట్టు? కృష్ణానదికి ఆ ప్రక్కన తుళ్ళూరు అయితే ఈ ప్రక్కన కంచిక చర్ల. వేలాది ఎకరాల పనికిరాని భూములు. తనకు ఇష్టమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే రెండు, మూడు రాజధానులు నిర్మించుకోవడానికి చాలినన్ని భూములు. మెట్ట భూములు, బంజరు భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, గింజ పండని భూములు.
అయినా తుళ్ళూరు మీద ఎందు కంత పట్టు? నదికి దిగువ ప్రాంతం మీదే ఎందు కంత ప్రేమ?
అక్కడ రాజధాని కడితే చినబాబు ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా జ్యోతిష్కులు చెప్పారా?
– విరాట్
Anna Hazare on Land Pooling,Boyapati Sudharani,CBN,Land Pooloing,Loksatta Narayana on land Pooling,Medha Patkar on Land Pooling,Nara Chandra Babu Naidu,Nara Lokesh,Nara Lokesh as CM,Thullur Land Pooling
https://www.teluguglobal.com//2015/04/26/is-land-pooling-near-thullur-is-to-make-lokesh-cm-as-said-by-astrologers-to-babu/