బీసీ కులగణనపై రీ సర్వే చేపట్టాలి : కేటీఆర్

2025-02-09 10:23:03.0

కులగణనలో బీసీ జనాభా సంఖ్యను తగ్గించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

తెలంగాణలో కులగణన సర్వే నివేదికలో బీసీ జనాభాను ఐదున్నర శాతం తగ్గించి చూపించారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతు కులగణన తప్పుల తడక, చిత్తు కాగితంతో సమానమని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన రీసర్వే చేపడితే కేసీఆర్ సహా అందరం అందులో పాల్గొంటామని సవాల్ చేశారు. మొన్న చేసిన కులగణన సర్వే మొత్తం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. బీసీల గొంతు కోసేలా ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 రిజర్వేషన్లుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.

దాదాపు 22 లక్షల మందిని లేనట్టుగా చూపించారని మండిపడ్డారు. బీసీ జనాభాను తగ్గించి చూపడంపై సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని.. ఒక వేళ వెళ్తే ప్రజలు తరిమి కొడతారని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదని చెప్పారు. ప్రజలు తిడుతున్న తిట్లకు రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్లు ఉంటే సూసైడ్ చేసుకునేవారని ఆరోపించారు. తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని కేటీఆర్ అన్నారు.

KTR,BRS Party,KCR,CM Revanth Reddy,Telanagana Goverment,Telangana Bhavan,BC Population,BC Corporations,Congress party