బీసీ మహాసభకు పోలీసుల అనుమతి

2025-01-02 14:50:06.0

శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు సభ

సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ జాగృతి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తలపెట్టిన బీసీ మహాసభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. సభకు పర్మిషన్‌ ఇస్తారా లేదా అనే ఉత్కంఠకు తెరదించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని కోరుతూ బీసీ మహాసభను తలపెట్టారు. ఈ కార్యక్రమానికి అనుమతుల కోసం సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆఫీస్‌ వద్ద జాగృతి, బీసీ సంఘాల నాయకులు గంటల తరబడి ఎదురు చూశారు. పోలీసుల నుంచి సమాధానం రాకపోవడంతో అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ కు ఎమ్మెల్సీ కవిత ఫోన్‌ చేసి సావిత్రిభాయి ఫూలే జయంతి సందర్భంగా తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత సభకు అనుమతి ఇస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇందిరాపార్క్‌ వద్ద సభ నిర్వహిస్తున్నామని.. బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నాయకులు విజ్ఞప్తి చేశారు.

BC Maha Sabha,Indira Park,Telangana Jagruthi,MLC Kavitha,Police Permission