2022-06-04 01:28:10.0
ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ శాఖలో సమన్వయ లోపం మరోసారి బయటపడింది. అధికారుల దుందుడుకు చర్యల వల్ల ఇప్పుడు ఈ అంశం రాజకీయ కోణంలోకి వెళ్తోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తొలుత విద్యా శాఖ ప్రకటించింది. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ చేతుల మీదుగా ఫలితాల విడుదల ఉంటుందని ప్రెస్ నోట్ పంపారు. అందుకు తగ్గట్టుగానే మీడియా […]
ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ శాఖలో సమన్వయ లోపం మరోసారి బయటపడింది. అధికారుల దుందుడుకు చర్యల వల్ల ఇప్పుడు ఈ అంశం రాజకీయ కోణంలోకి వెళ్తోంది.
ఈ రోజు ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తొలుత విద్యా శాఖ ప్రకటించింది. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ చేతుల మీదుగా ఫలితాల విడుదల ఉంటుందని ప్రెస్ నోట్ పంపారు. అందుకు తగ్గట్టుగానే మీడియా సమావేశానికి బ్యానర్లు, కుర్చీలు అన్ని సిద్ధం చేశారు. మీడియా ప్రతినిధులు వచ్చారు. ఆరు లక్షల మంది విద్యార్థులు మరికాసేపట్లో ఫలితాలు వస్తాయని ఎదురుచూస్తుండగా.. సమయం 11 గంటలు దాటిపోయింది. కానీ ఫలితాలు మాత్రం రాలేదు. ఆఖరి నిమిషం వరకు కనీస సమాచారం ఇచ్చేందుకు కూడా ఏ అధికారి ముందుకు రాలేదు. చివరకు సమయం మించిపోవడంతో సాంకేతిక కారణాల వల్ల ఫలితాలను సోమవారానికి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు.
ఫలితాలు వాయిదా పడడానికి కారణం సాంకేతిక అంశాలు కాదన్న వార్తలొస్తున్నాయి. తొలుత అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో మీడియా ప్రతినిధులు నేరుగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఫోన్ చేసి ఆరా తీశారు. దాంతో అసలు ఫలితాల విడుదల ఈ రోజు వద్దు…సోమవారం పెట్టుకుందామని తాను అధికారులకు ఇది వరకే చెప్పానని… కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అధికారులు పొరపడినట్టుగా ఉన్నారని మంత్రి వెల్లడించారు.
విద్యా శాఖ మంత్రిగా బొత్స ఉన్నప్పటికీ ఆయనకు సమాచారం కూడా ఇవ్వకుండానే ఫలితాల వెల్లడికి అధికారులు ముందుకెళ్లారన్న ప్రచారం నడుస్తోంది. ఫలితాలు కూడా మంత్రి చేతుల మీదుగా కాకుండా.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ చేతుల మీదుగానే విడుదల చేస్తామని ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పరిణామాలపై మంత్రి బొత్స ఆగ్రహం చేసినట్టు కథనాలు వస్తున్నాయి. ఆ వివాదం కారణంగానే ఫలితాలను సోమవారానికి వాయిదా వేసినట్టు చెబుతున్నారు.
విద్యాశాఖ మంత్రిగా బొత్స వచ్చిన తర్వాత … విద్యా శాఖపై జరిగిన తొలి సమీక్ష సమావేశం కూడా ఆయన లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి నిర్వహించారు. అప్పట్లో దానిపై విమర్శలు రాగా… ఇతర పనుల కారణంగా బొత్స హాజరు కాలేకపోయారంటూ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు మరోసారి పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల సందర్భంగానూ మంత్రికి, అధికారులకు మధ్య సమన్వయం లేదన్న విషయం బహిర్గతమైంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రం నిరుత్సాహపడ్డారు. అసలు మంత్రి చేతుల మీదుగా కాకుండా అధికారులే ఫలితాల విడుదలకు సిద్ధమవడమూ చర్చనీయాంశమైంది.
AP SSC,Doomsday in the control of the US Government,Education Minister Botsa Satyanarayana,Postponement of tenth class examination results in AP