2024-09-26 05:26:58.0
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్న బొత్స సోదరుడు లక్ష్మణరావు
https://www.teluguglobal.com/h-upload/2024/09/26/1363203-laxman-rao.webp
విజయనగరం జిల్లాలో వైసీపీ మరో షాక్ తగలనున్నది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు త్వరలో జనసేన కండువా కప్పుకోనున్నారు. వ్యాపారరంగంలో ఉన్న ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పదేళ్లుగా యత్నిస్తున్నారు. జిల్లాలో సామాజికంగా అనుకూలంగా ఉండి, ఏ స్థానం నుంచైనా పోటీ చేయాలని అనుకున్నా అవకాశం దక్కలేదు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అప్పలనాయుడుకు వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. తన అనుచరులుగా ఉన్న ఏడుగురు సర్పంచులను జనసేనలోకి పంపి, తద్వారా కూటమి విజయానికి పరోక్షంగా సహకారం అందించారని విమర్శలున్నాయి.. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీని వీడాలని ఆయన తాజాగా నిర్ణయించుకున్నారు. దసరా తర్వాత ముహూర్తం చూసుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.