భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేయడమా?

2024-11-07 08:52:12.0

వైసీపీ ఫేక్‌ రాజకీయాలే పనిగా పెట్టుకున్నదని ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు

https://www.teluguglobal.com/h-upload/2024/11/07/1375597-chandrababu.webp

ఏపీలో 2019 నుంచి విద్యుత్‌ విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాళ్లాయపాలెంలో గ్యాస్‌ ఆధారిత సబ్‌ స్టేషన్‌ ను సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దుర్మార్గపు ఆలోచనతో విద్యుత్‌ ఒప్పందాలను జగన్‌ రద్దు చేశారు. పీఏపీల రద్దుపై కోర్టులు మొట్టికాయలు వేసినా మారలేదన్నారు. వాడని విద్యుత్‌కు రూ. 9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. తొమ్మిది సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 32,166 కోట్ల భారాన్ని మోపారని ధ్వజమెత్తారు. వైసీపీ ఫేక్‌ రాజకీయాలే పనిగా పెట్టుకున్నదని చంద్రబాబు విమర్శించారు. సోషల్‌ మీడియాలో వాడే భాష చూస్తున్నాం. తనతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి అనిత, ఎమ్మెల్యేలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ బిడ్డలపైనా ఇష్టారీతిన పోస్టులు పెట్టారని.. అలాంటి వారిని వదిలిపెట్టాలా? అని ప్రశ్నించారు. కొవ్వు ఎక్కువై నేరస్థులుగా తయారవుతున్నారని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించిన సీఎం ఆ కొవ్వును కరిగిస్తామన్నారు. నేను ఎప్పుడు రాజకీయం చేయను.. నన్ను మోసం చేయాలనుకుంటే వదిలిపెట్టను. దేశం, ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ అధ్యయనం చేస్తా. ఆడ బిడ్డలకు ఇబ్బంది కలిగించేలా హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు.. ఇక ఖబడ్దార్‌ అని సీఎం హెచ్చరించారు. మీరు మనుషులేనా? మీకూ, మృగాలకు తేడా ఏమిటి? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేయడమా? అసభ్య, అశ్లీల పోస్టులు పెట్టడమా? ఏ చట్టం మీకు ఈ హక్కు ఇచ్చింది? అని ప్రశ్నించారు. దీనిపై సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. పకడ్బందీగా చట్టం తీసుకొస్తాం. నేరస్థులను కట్టడి చేయడానికి పోలీసులను సమర్థంగా తీర్చిదిద్దుతామన్నారు.