భైరవగుట్టపై కొత్తరాతి యుగపు ఆనవాళ్లను పరిరక్షించుకోవాలి

భైరవగుట్టపై విస్తృతంగా జరిపిన పురావస్తు అన్వేషణలో దాదాపు పదికి పైగా కొత్తరాతి యుగపు రాతి గొడ్డలు, సానపెట్టిన రాతి సానెలు ఉన్నాయని, గుట్టపై శిలాయుగపు కొండ చరియ ఆవాసాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

భూత్‌పూర్ మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కనున్న తాటికొండ భైరవగుట్టపై కొత్త రాతియుగపు ఆనవాళ్లను గుర్తించినట్టు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్ట‌ర్‌ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. భూత్‌పూర్‌కు చెందిన రామలింగేశ్వర ఆలయ ధర్మకర్త, సత్తూర్ అశోక్ గౌడ్ సమాచారం మేరకు ఆయన సోమవారం భైరవగుట్టపై విస్తృతంగా జరిపిన పురావస్తు అన్వేషణలో దాదాపు పదికి పైగా కొత్తరాతి యుగపు రాతి గొడ్డలు, సానపెట్టిన రాతి సానెలు ఉన్నాయని, గుట్టపై శిలాయుగపు కొండ చరియ ఆవాసాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

ఏడు నుంచి 15 అంగుళాల పొడవు, రెండు నుంచి నాలుగు అంగుళాల వెడల్పు, అంగుళం లోతు గాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, నిర్మాణ సామగ్రి కోసం రాతిని తీసే క్రమంలో ఇవి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని శివనాగిరెడ్డి సూచించారు. క్రీ.పూ. 4000 సంవ‌త్స‌రాలకు చెందిన ఈ ఆదిమానవుని ఆనవాళ్లను కాపాడుకొని, భావితరాలకు అందించాలని తాటికొండ గ్రామ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, బంగారు బాలకృష్ణ పాల్గొన్నారని ఆయన చెప్పారు.

Archaeological Researcher,Shivanagi Reddy,Examined,New Stone Age,Monuments,Tatikonda,Bhairavagutta