మట్టి మిద్దె కూలి నలుగురు మృతి.. నంద్యాల జిల్లాలో దారుణం

2024-08-02 04:15:20.0

నిద్రపోతున్న ఆ నలుగురిపై మట్టి మిద్దె పడటంతో ఏం జరిగిందో కూడా అర్థమయ్యేలోపే వారు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు కూడా ఎవరూ గుర్తించలేకపోయారు.

https://www.teluguglobal.com/h-upload/2024/08/02/1349051-four-killed-in-slab-collapse-in-nandyal-district.webp

నంద్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నంద్యాల జిల్లా చాగలమర్రు మండలం చిన్న వంగలిలో గురుశేఖర్‌రెడ్డి (45) తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతనికి భార్య దస్తగిరమ్మ (38), ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రసన్న కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో చదువుతోంది. మిగిలిన ఇద్దరు పిల్లలు మాత్రమే వీరితో పాటు ఉంటున్నారు.

గురువారం రాత్రి గురుశేఖర్‌రెడ్డి, దస్తగిరమ్మ, వారి కుమార్తెలు పవిత్ర (16), గురుల‌క్ష్మి (10) యథావిధిగా తమ ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వారి ఇంటి మట్టి మిద్దె కుప్పకూలిపోయింది. నిద్రపోతున్న ఆ నలుగురిపై మట్టి మిద్దె పడటంతో ఏం జరిగిందో కూడా అర్థమయ్యేలోపే వారు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు కూడా ఎవరూ గుర్తించలేకపోయారు. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గమనించి హుటాహుటిన మట్టి శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పెద్ద‌ కుమార్తె ఇంటికి దూరంగా ఉంటూ చ‌దువుకుంటుండ‌టం వల్ల ప్రమాదం నుంచి బయటపడింది.