మనసు…మతాబు (ఉహాపథం)

2023-11-12 09:33:14.0

https://www.teluguglobal.com/h-upload/2023/11/12/855228-mathabu.webp

దీపావళి సందడి మొదలై నెలవుతోంది.

ప్రతీ పెరడు గంధకం వాసనతో గుప్పు మంటోంది .

మతాబులో…సిసింద్రీలో…

చిచ్చుబుడ్లో …ఇంటింటా వెలుగులు

చిందించబోతున్నాయి.

నాన్నా …అన్నయ్యలు ..

చిట్టితమ్ముడు ..రాత్రీపగలూ..

తయారుచేసిన టపాసులన్నీ ఎండబెట్టా…..ఎత్తిపెట్టా …

అదే ధ్యాస , అదే శ్వాస గా వున్నారు.

మతాబులు మల్లెపూవులై నవ్వాలి..చిచ్చుబుడ్లు గుమ్మంలోఅమ్మవారి

గుమ్మటం లా కళకళ్ళాడుతూవెలుగులు నింపాలి.ముందుగా మా ఇంటికే రావాలి పండుగ వేడుక ..

అందరిళ్ళల్లోనూ ఇదే కోరిక..

నరకచతుర్దశి …నలుగులు, తలంట్లు పోసుకొని…ఎప్పుడు తెల్లవారుతుందా….

ఎప్పుడుచీకటవుతుందా …

అమ్మ లక్ష్మీ పూజ చేసి , దీపాలుఎప్పుడు వెలిగిస్తుందా…దివిటీలు కొట్టాలి…కాళ్ళు కడగాలి..

తీపి వంటకం తినాలి.

అప్పుడు …అప్పుడు టపాసులు కాల్చాలి..!

వీధంతా దద్దరిల్లిపోయేలా పేల్చిపారేయాలి….ఒకటే ఆత్రం…!

దీపావళి రానేవచ్చింది..

అమ్మచేసిన పిండివంటలారగించి..

కొత్తబట్టలుకట్టుకుని…పగలంతా..చిన్నా చితకా ..తాటాకు టపాకాయలు కాలుస్తుండగానే….

సంధ్య పొద్దు వాలింది.

చెప్పలేని సంతోషం..ఒకటే కంగారు..కాని !నాన్న ఇంకా..కాల్చుకోమనడేం, ప్చ్…!?వీధిలో మెల్లగా సందడి మొదలైపోయిందప్పుడే..

అరుగుమీదున్నబాణాసంచా

వైపు …నాన్నవైపు మార్చి మార్చి చూస్తున్న నా చూపులు…! నన్ను చూసి

అమ్మ ముసిముసి నవ్వులు..

అబ్బా….ఇంకెంతసేపు…!?

ఉత్సాహం..నిరుత్సాహం కాకరపువ్వొత్తిలా …కరకరా, కచకచామంటుంటే….

చుట్టూ చీకటి ముసురుకొంది.

హమ్మయ్య….!నాన్న పిలిచాడు..కొవ్వొత్తి వెలిగించిచ్చి కాల్చుకోమన్నాడు..

ఆగేపనిలేదు …అంతే ఒకటే పరుగు ..

ఆచిన్నివయసు …..సిసింద్రీ!

ఆ లేత మనసు ….మతాబు!

ఆఉత్సాహం….కాకరపువ్వొత్తి!

ఆ అంతులేని ఆనందం…. చిచ్చుబుడ్డి! ఆ దివ్వెల కాంతులు ….నాన్న కళ్ళల్లో వెలుగులు…!ఆ దీపాల జ్యోతులు….అమ్మ చేతి కమ్మని పిండివంటలు……!

ఏడాదికోసారి దీపాలపండగొస్తోంది…

వెలుగులువిరజిమ్ముతూనేవుంది..కొత్తతరానికి ఆనందం రెట్టింపుచేస్తూ… ఇంతకీ…… ఎగిరి గంతులేసే ఆ వయసేది…!ఎక్కడికి పోయింది ..!మళ్ళీ రాదేం ……రాదు ..తెలియదా ..కొవ్వొత్తిలాకరిగిపోయిందిగా…!

కాని!వెలుగుతున్నజ్ఞాపకం మాత్రం జాజి పరిమళమై ..

గుబాళిస్తూనే వుంది నేటికీ ..!

– భారతీ కృష్ణ

Bharti Krishna,Manasu Mathabu,Diwali 2023