2023-09-15 11:40:18.0
రెండు నెలలుగా అతడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. చివరకు అతను చనిపోయాడని ప్రకటించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించారు. రెండు నెలలపాటు అతని శరీరంలో పంది కిడ్నీ ఆశించినదానికంటే మెరుగ్గా పనిచేయడం వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేసింది.
అవయవ మార్పిడి మనుషుల నుంచి మనుషులకే కాదు, జంతువుల నుంచి మనుషులకు కూడా సులభమేనని తాజా పరిశోధన నిరూపించింది. న్యూయార్క్ లోని NYU లాంగోన్ హెల్త్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తిలో పంది కిడ్నీ రెండు నెలల పాటు బ్రహ్మాండంగా పనిచేసింది. బతికి ఉన్న మనిషిలో కూడా ఈ తరహా ప్రయోగం చేపట్టడానికి వైద్యులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది మానవ అవయవ మార్పిడిలో మరో నూతన శకం అని చెబుతున్నారు.
మారిస్ మో మిల్లర్ అనే వ్యక్తిని రెండు నెలల క్రితం బ్రెయిన్ డెడ్ గా గుర్తించారు. అతను గతంలోనే ఆర్గాన్ డొనేషన్ కి సంసిద్ధత తెలిపిన వ్యక్తి. అయితే క్యాన్సర్ వల్ల అతని అవయవాలను ఎవరికీ అమర్చడానికి వీలుపడలేదు. అదే సమయంలో కుటుంబ సభ్యుల అనుమతితో అతని శరీరంలో పంది కిడ్నీ అమర్చారు NYU లాంగోన్ హెల్త్ వైద్యులు. రెండు నెలల పాటు అది బ్రహ్మాండంగా పనిచేసింది. రెండు నెలలుగా అతడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. చివరకు అతను చనిపోయాడని ప్రకటించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించారు. రెండు నెలల పాటు అతని శరీరంలో పంది కిడ్నీ ఆశించిన దానికంటే మెరుగ్గా పనిచేయడం వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేసింది.
సహజంగా మన శరీరం మనది కాని ఇతర అవయవాలను అంత తేలిగ్గా స్వీకరించదు. గుండె రక్తనాళాల్లో లో వేసే స్టంట్ కూడా మన శరీరంలో ఇమిడిపోయేందుకు ప్రతి రోజూ మందులు వాడాల్సి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ కూడా ఇలాగే పనిచేస్తుంది. మనిషి శరీరంలో పంది కిడ్నీ అనేది పెద్ద సాహసమే అని చెప్పాలి. కానీ ఇక్కడ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిపై చేసిన పరిశోధన కావడంతో మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందంటున్నారు వైద్యులు. ఈ ప్రయోగానికి నాయకత్వం వహించిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాబర్ట్ మోంట్ గోమెరీ. త్వరలో బతికి ఉన్న వ్యక్తులపై కూడా ఇలాంటి ప్రయోగం చేపట్టడానికి సిద్ధమవుతున్నట్టు డాక్టర్ ప్రకటించారు. అవయవ దాతల కోసం ఎదురు చూస్తున్న చాలా మందికి ఈ ప్రయోగం సరికొత్త ఆశలను రేకెత్తిస్తోందని చెప్పారు.
♦
pig kidney,nyu hospital,kidney transplantation