2022-12-15 17:24:33.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/15/431416-money-plant.webp
ల.. ల.. లా… ల .. ల లా.. అంటూ ఏదో ట్యూన్ హమ్మింగ్ చేస్తూ ఆఫీసు నుండి ఇంటికి బయలు దేరాడు ప్రదీప్. తన గోల్డెన్ పీరియడ్ లొ కొనుక్కున్న బైక్ స్టార్ట్ చేశాడు. ప్రతి మగాడి జీవితం లొ ఓ గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. అది 99.99%పెళ్ళికి ముందే ఉంటుంది. ఎందుకంటే ఆ పీరియడ్ లో ప్రతి మగాడు తానే ప్రెసిడెంట్.. తానే మంత్రి.
పెళ్లయ్యాక ‘ఓం సచ్చిదానంద నీ సర్వం గోవిందా’ అన్న రీతిలో తాను ఉత్త ప్రెసిడెంట్ గా మిగిలిపోయి, భార్య ప్రధాన మంత్రిగా ఛార్జి తీసుకోవడం (లాక్కోవడం ) ఆటోమేటిక్ గా జరిగిపోతుం
దన్నమాట.ఇది అమెరికా లొ నైనా అనకాపల్లి లొ నైనా అదంతే!అదంతే!!.
ప్రస్తుతః మనోడు మ్యారేజ్ ఫస్టియర్ (డిగ్రీ ఫస్టియర్ లాగా ). బైక్ పార్క్ చేసి లోపలికి వస్తుండగా పక్కింటి ఆంటీ నిష్క్రమిస్తూ కనపడింది. చచ్చింది గొర్రె!. ఏమి ఫిట్టింగ్ పెట్టిందో అని శoకిస్తూ వచ్చిన మనోడికి ప్రధాన మంత్రి… అదే భార్యామణి ప్రత్యూష కాఫీ కప్పుతో వచ్చింది.
వ్వాట్!!అని హాశ్చర్య పోకండి. పెళ్ళైన కొత్తల్లో అంతాఅంతే. ప్రదీప్ ప్రమోదంతో కాఫీ సిప్ చేస్తుండగా ప్రత్యూషాంబాళ్ “ఏమండీ.. ఏమండీ.. మరీ మరీ ” అని గునుస్తుండగా మనోడు “అబ్బా ప్రత్యూషా మరీ అన్ని మరీలా! నాంచకుండా పాయింటుకు రా “అన్నాడు
“మరేం లేదండి.. ఇంట్లో
మనీప్లాంట్ పెట్టుకుంటే డబ్బులు బాగా వస్తాయంట “
“ఓస్! అంతేనా! దానికేం భాగ్యం. రేపే నర్సరీ నుండి ఒకటి పట్టుకొస్తాను”అన్నాడు పెద్ద టెండర్ కానందుకు
“అబ్బే.. అలా కొని తేకూడదట.దొంగతనంగా ఎవరింట్లోనుంచైనా తేవాలిట”
మళ్ళీ చచ్చింది గొర్రె! “ఏంటి! దొంగతనంగానే తేవాల్నా? ఇదేం ఫిట్టింగూ? ఇంకా నయం కొట్టి తెమ్మనలేదు!” “ఔనంటoడీ.. అదంతే… అదే శాస్త్రమట!అప్పుడే మనీ ప్లాంట్ మహిమ ఉంటుందట”
ఇక చేయునదేమున్నది? మ్యారేజ్ ఫస్టియర్ కదా. మాయలేడి వెంట శ్రీ రాముల వారు వెళ్లినట్లు మన ప్రదీపులవారు మనీ ప్లాంట్ వేటలో పడ్డాడు. తనకు తెలిసిన వాళ్ళ ఇళ్లలోగాని, ఆఫీసు వాళ్ళింట్లోగాని లేదు. అలా ఉంటే ఏదో అలా ఫ్రెండ్లీ గా వెళ్లి దొంగగా తేవచ్చు.
పట్టు వదలని విక్రమార్కుడు లా వెతకగా మనోడుండే వీధిలో ఒకరింటి కిటికీ ముందు దర్శనమిచ్చింది. మనోడు రెండ్రోజులు రెక్కి చేశాడు. చిన్న గేటు. దానికి పదడుగుల దూరం లో కిటికీ !
అంతా ok అనుకుని నెక్స్ట్ డే బ్రాహ్మి ముహూర్తమున మార్నింగ్ వాక్ వెళ్తూ మనీప్లాంటాపహరణం చెయ్యాలని డిసైడ్ జేసినాడు. ట్రాక్ ప్యాంటు, మంకి క్యాప్ పెట్టుకుని (చలి కాలం లెండి ) తెల్లవారుజాము నే బయలుదేరాడు. చలి కాలం కాబట్టి ఒకరో.. ఇద్దరో.. కనపడుతు న్నారు.
అదను చూచి ఆరితేరిన దొంగలాగా చటుక్కున గేటు దాటి లటుక్కున మనీప్లాంట్ కొమ్మ పీకాడు. పది నిమిషాల ముందుదే ఇంటి ఓనర్ మార్నింగ్ వాక్ కు రెడీ అవుతూ కుక్కను వదిలాడు. అది మనోడ్ని చూసి మీదికి లంఘించింది
ఇలాంటి ప్రమాదాలు వస్తే ఏం చెయ్యాలో రెక్కి లొ ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి వెంటనే గేటు దగ్గరున్న బాదం చెట్టు కొమ్మను తెలుగు హీరో లాగా జంప్ చేసి పట్టుకుని వేలాడసాగాడు. కుక్క అరుపులు విని బయటకొచ్చాడు ఇంటి ఓనర్ అశోక్.
కొమ్మకు వేలాడుతున్న అగంతకుడు ,కింద అరుస్తూ కుక్క. అంతే ! ఆటోమాటిక్ గా “దొంగ.. దొంగ “అని అరిచాడు అశోక్.
క్షణాల్లో జనం పోగయ్యారు. “పోలీసులకు ఫోన్ జెయ్యండి అన్నాడొక సారువాడు. “అయ్యా.. బాబూ.. నేను దొంగను కాదు. కుక్కను కట్టేస్తే కిందకు దిగి చెప్తా “అన్నాడు ప్రదీప్ కంగారుతో.
ఇంటి ఓనరు అశోక్ కుక్కను కట్టేసాడు.
మనోడు కొమ్మ వదలి దబ్బున దూకి అటువైపు తిరిగి నిలబడ్డాడు.”సారూ కాస్త ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చుకో అన్నాడో చిరంజీవి అభిమాని. మనోడు అలాగే చేసి మంకీ క్యాప్ తీసేశాడు. అందరు చూశాక వెంటనే పెట్టుకున్నాడు.
” అరే!! మీరా? మీరు… మీరు రోజూ పార్క్ కు మార్నింగ్ వాక్ వస్తారు కదా?!. మీరు… ఇలా….?! “అంటూ ఇంటి ఓనర్ అశోక్ హాశ్చ ర్య ఫేస్ పెట్టాడు.
మనోడు “అదీ.. అదీ… నా భార్య మనీ ప్లాంట్ కావాలంది. అదికూడా దొంగతనంగానే తేవాలట. శాస్త్రమట.. నా బొందట.. అందుకని…. ఇలా..”అంటూ కిందపడిన మనీ ప్లాంట్ కొమ్మ చూపించి బ్యారుమన్నాడు.
” బలే వాడివి బాసూ “అంటూ అందరూ నిష్క్రమించిరి.మనోడు అదే ప్రదీపకుమార వెంటనే ఇంటికి పోకుండా అలా అలా తిరిగి పోవాలనుకున్నాడు తన ఇంటిని ఎవరు గుర్తుపట్టకుండా.
చోరగుడి మల్లికార్జున శర్మ
Money Plant,Telugu Kathalu