‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి శ్రోతలే నిజమైన యాంకర్లు

2024-09-29 07:28:45.0

114వ ఎపిసోడ్‌ తనకు భావోద్వేగమైనదని, చాలా ప్రత్యేకమైనది అన్న ప్రధాని నరేంద్రమోడీ

https://www.teluguglobal.com/h-upload/2024/09/29/1364230-pm.webp

తన మనసులో మాట పేరుతో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం 114వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఇందులో నీటి నిర్వహణ గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ అంశం చాలా కీలకమని పేర్కొన్నారు. నీటి సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

“మన్ కీ బాత్ శ్రోతలే యీ షో కు నిజమైన యాంకర్లు. . వ్యతిరేక వార్తలు. . సంచలనాత్మక అంశాలు లేకుంటే ఆ సమాచారం పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ సానుకూల వార్తల కోసం ఈ దేశ ప్రజలు ఎంత ఆకలితో ఎదురుచూస్తున్నారో మన్‌ కీ బాత్ నిరూపించింది. సానుకూల కథనాలు. ప్రేరణాత్మక ఉదాహరణలు. ఉత్సాహపరిచే కథలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపెడుతున్నారని” ప్రధాని తెలిపారు.

భారత్‌ 20 వేల భాషలకు పుట్టినిల్లు అని పేర్కొన్న ప్రధాని ‘తల్లి పేరిట మొక్క’ కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నదన్నారు. ఈ కార్యక్రమం కింద గుజరాత్‌లో 15 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు ఆయన తెలిపారు. యూపీలో 26 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు చెప్పారు. క్రియేట్‌ ఇన్‌ ఇండియాలో భాగస్వామ్యం కావాలని నూతన ఉత్పత్తుల తయారీదారులకు ప్రధాని పిలుపునిచ్చారు.

భారత్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మేకిన్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తయ్యిందని ప్రధాని అన్నారు. దీంతో ప్రతి రంగంలోనూ ఎగుమతులు పెరిగాయాని, విదేశీ సంస్థాగత మదుపరులను ఆకర్షించడంలో ప్రభుత్వం పురోగతి సాధించిందన్నారు. ఈ కార్యక్రమం స్థానిక తయారీదారులకు సాయపడిందన్నారు. రానున్న పండుగల సీజన్‌లో దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా 2014 అక్టోబర్‌3న మొదటిసారి మన్‌ కీ భారత్‌ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Mann Ki Baat,PM Modi says,emotional episode,The programme completes 10 years