మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కారుపై రాళ్ల దాడి

2024-11-18 17:50:19.0

ఈ ఘటనలో ఆయనకుకు తీవ్ర గాయాలైనట్లు పోలీసుల వెల్లడి

https://www.teluguglobal.com/h-upload/2024/11/18/1378977-anil-deshmukh.webp

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరిన వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వాహనంపై నాగ్‌పూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నార్ఖేడ్‌లో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన అనిల్.. అనంతరం కటోల్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో జలాల్‌ఖేడా రోడ్‌లోని బెల్‌ఫాటా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. హుటాహుటిన కటోల్‌ ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని, దాడికి పాల్పడిన వారిని గుర్తించడానికి చర్యలు చేపట్టినట్లు నాగ్‌పూర్‌ రూరల్‌ ఎస్పీ వెల్లడించారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ గతంలో రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు. రూ. కోట్లలో లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ఆయన కుమారుడు సలీల్‌ దేశ్‌ ముఖ్‌ ప్రస్తుతం కటోల్‌ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ (ఎస్పీ) తరఫున పోటీ చేస్తున్నారు. నేటితో ప్రచారం ముగిసింది. ఎల్లుండి మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనున్నది. నవంబర్‌ 23న ఫలితాలు వెల్లడవుతాయి.

Former Maharashtra Minister,Anil Deshmukh,Seriously Injured,Stone Pelting At His Car