2024-11-29 06:16:29.0
ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం అన్న శిండే. మహారాష్ట్రలోని సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తున్న బీజేపీ హైకమాండ్
https://www.teluguglobal.com/h-upload/2024/11/29/1381903-maharastra.webp
మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరో తెలుసుకోవడానికి ఇంకా రెండు మూడు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వస్తుందని ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ శిండే అన్నారు. నిన్న రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత మహారాష్ట్రకు బయలుదేరే ముందు షిండే దీనిపై స్పందిస్తూ.. మహారాష్ట్ర సీఎం పదవిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు సానుకూలంగా జరిగాయి. ముంబయిలో మరోసారి చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. మిత్రపక్షాల మధ్య మంచి సమన్వయం ఉన్నది. మేమంతా సానుకూలంగా ఉన్నాం. ప్రజలు మాకు ఇచ్చిన స్పష్టమైన తీర్పుపై మాకెంతో గౌరవం ఉన్నది. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మేం నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు తెలుస్తందని శిండే ప్రకటించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భారీ విజయాన్ని సాధించింది. మహాయుతి కూటమిలో బీజేపీ 132 సీట్లు సొంతం చేసుకోగా.. శిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు కైవసం చేసుకున్నది. విపక్ష మహా వికాస్ అఘాడీ 46 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.
మహాయుతి భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ సీఎం ఎంపిక విషయంలో మాత్రం ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే ఏక్‌నాథ్ శిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ గత రాత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. మరోవైపు సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో మహారాష్ట్రలోని సామాజిక సమీకరణాలను బీజేపీ హైకమాండ్ బేరీజు వేస్తున్నట్లు సమాచారం. ఫడ్నవీస్ సీఎం రేసులో ముందున్న మరో ఆలోచనపైనా బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని శిండే తిరస్కరించారని ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు. క్యాబినెట్‌లో ఆయన భాగంగా ఉండాలని, అయితే సీఎంగా చేసి మళ్లీ డిప్యూటీ సీఎంగా ఎలా చేయగలరని శివసేన ఎమ్మెల్యే సంజయ్ సిర్సాత్ అభిప్రాయపడ్డారు.
New Maharashtra Government,Maharashtra CM Post,Amit Shah,Ekanth Shinde,Devendra Fadnavis,Mahayuti