2025-02-12 01:48:00.0
ఈ మాసంలో దేవతలు తమ సర్వశక్తులను నది, సముద్ర జలాల్లో ఉంచుతారనేది పురాణ కథనం
చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. కార్తికం దీపారాధనకు ప్రసిద్ధి అయితే మాఘ మాసం పవిత్ర పుణ్యస్నానాలకు ప్రసిద్ధి. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం. పాపాలను తొలిగించేది అందుకనే ఈ మాసానికి, మాఘ పౌర్ణిమకి అంతటి ప్రాధ్యాన్యం దక్కింది. మాఘ పౌర్ణమినే మాహామాఘి అనీ అంటారు. ఏడాదిలో వచ్చే అన్ని పౌర్ణిమల్లోనూ ఇది చాలా విశిష్టమైనది. అందుకే ఏటా ప్రయాగ్ రాజ్‌లో మాఘ మేళా నిర్వహిస్తారు.
ఈ మాసంలో దేవతలు తమ సర్వశక్తులను నది, సముద్ర జలాల్లో ఉంచుతారనేది పురాణ కథనం. మాఘ పౌర్ణిమ రోజు శ్రీ మహావిష్ణువు స్వయంగా గంగలో కొలువై ఉంటాడని శాస్త్రం పేర్కొంటున్నది. ఈరోజు నదీ లేదా సముద్రం, లేకపోతే ఇంట్లోనే శ్రీ మహావిష్ణువును, గంగను స్మరిస్తూ తలస్నానం ఆచరించాలని పెద్దలు చెబుతారు. మాఘ పౌర్ణిమ రోజు చేసే జపాలు, హోమాల వల్ల కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. రేగు పండ్లు, అన్నదానం, తిలదానాలు అనంత ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున చంద్రుడు తన కిరణాలతో ఆశీర్వదిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే చంద్రుడికి అర్ఘ్వం సమర్పించి చంద్రకాంతిలో కూర్చుని చంద్రుడికి పూజలు చేస్తారు. లలితా దేవి, సతీ దేవి ఈ పౌర్ణిమనే పుట్టారు. సూర్యుడు, సరస్వతీదేవి కూడా ఈ మాసంలోనే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. రామసేతు పూర్తయిన రోజుగా రామాయణం తెలియజేస్తున్నది. ఈ మాసం మొత్తం నదీ స్నానం ఆచరించలేని వాళ్లు మౌని అమావాస్య, వసంత పంచమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణిమ రోజుల్లోనైనా నదీ స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం.
Magha Purnima 2025,Highly auspicious day,Puja Rituals,Spiritual Significance,Devotees engage in sacred baths