2022-07-19 10:59:23.0
శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజల ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోయిన తర్వాత ప్రస్తుతం ఆదేశం కొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్ నేత అనురా దిస్సనాయకేలు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.
శ్రీలంక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారంనాడు అధ్యక్ష ఎన్నికలకు అన్నిఏర్పాట్లు పూర్తయిన సమయంలో ఎన్నికల బరిలో ఉన్న విపక్ష నాయకుడు, సమగి జన బలవేగయ(ఎస్ జెబి)అధినేత సాజిత్ ప్రేమదాస పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మంగళవారంనాడు ప్రకటించారు. అంతేగాక తన ప్రత్యర్ధి శ్రీలంక పోడుజన పెరమున ( ఎస్ఎల్పీపీ) పార్టీ ఎంపి దుల్లాస్ అలహప్పెరుమకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అంతా ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన విజయానికి పనిచేయాలని కోరారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలతో దుల్లాస్ అలహప్పెరుమ గెలవడానికి అవకాశాలు మెరుగుపడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక అనంతర పరిణామాల్లో హింసాయుతంగా మారింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయి పదవికి రాజీనామా చేశారు. దీంతో అధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది. తాత్కాలిక అద్యక్షుడిగా ప్రదాని రణిల్ విక్రమసింఘే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో రేపు అధ్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నారు.
కొద్ది రోజుల ముందు సాజిత్ ప్రేమదాస అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. బరిలో నిలిచారు కూడా. అయితే అనూహ్యంగా బరినుంచి తప్పుకుని దుల్లాస్ కు మద్దతునిస్తున్నారు. దుల్లాస్ కు చెందిన ఎస్ జెబి పార్టీకి 55 మంది ఎంపీలు ఉన్నారు. ఇతర పార్టీల నుంచి కూడా ఆయనకు మద్దతు ఉంది. దీంతో ఆయనకు 80 మంది ఎంపీల మద్దతు ఉందని తెలుస్తోంది. అయితే మెజారిటీ మార్క్ కు ఇంకా 33 మంది మద్దతు అవసరం అవుతుంది. ఎలాగైనా ఆ మద్దతు కూడగట్టుకుంటారనుకున్న తరుణంలో అకస్తాత్తుగా సాజిత్ ప్రేమదాస పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. ఆయన దుల్లాస్ కు మద్దతు ప్రకటించడంతోనూ, ఎస్ ఎల్ పి పి కి చెందిన ఎంపీల మద్దతు లభిస్తే దుల్లాస్ అలహప్పెరుమ శ్రీలంక అధ్యక్షుడు కావడం తథ్యమనే అంచనాలు వున్నాయి.
యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పి)కి చెందిన రణిల్ విక్రమసింఘేకు మద్దతు ఇవ్వాలని ఎస్ ఎల్ పి పి మొదట నిర్ణయించింది, అయితే విక్రమసింఘే పట్ల ఎస్ ఎల్ పి పిలో వ్యతిరేకత రావడంతో మాజీ విదేశాంగ మంత్రి జిఎల్ పీరీస్, అలహప్పెరుమను బరిలో దింపాలని ఎస్ ఎల్పిపిలో ప్రతిపాదించారు.
ఇంతకీ ఎవరీ దుల్లాస్ అలహెప్పెరుమ..?
దుల్లాస్ అలహెప్పెరుమ (63) మాజీ జర్నలిస్టు. అతను 1994లో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టాడు. మంత్రిగా పనిచేశాడు. దుల్లాస్ 1993 ఎన్నికలలో గెలిచిన తర్వాత మాస్ మీడియా కమ్యూనికేషన్స్ మంత్రిగా, క్యాబినెట్ ప్రతినిధిగా పనిచేశారు. సాంస్కృతిక వ్యవహారాల శాఖతో పాటు పలు మార్లు మంత్రిగా కూడా పనిచేశారు.
క్రియాశీల రాజకీయాల్లో చేరడానికి ముందు, అలహప్పెరుమ సింహళ టాబ్లాయిడ్‌లలో పనిచేశారు. అతను 2016 నుండి దక్షిణ శ్రీలంకలోని మతారా నుండి పోటీ చేస్తూ వస్తున్నారు. అతను రాజపక్సేలకు మిత్రుడు, అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకున్నప్పుడు రాజపక్సే ఏప్రిల్‌లో మంత్రివర్గాన్ని రద్దు చేయడంతో రాజీనామా చేశారు. అయితే ఆ వర్గంలోని ప్రజా ప్రతినిధులతో కూడా దుల్లాస్ కు మంచి సాన్నిహత్యం ఉండడంతో వారి మద్దతు కూడా ఆయనకు లభిస్తుందని అంటున్నారు. వీరి మద్దతు కూడా లభిస్తే తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీలు తమ సభ్యులను క్రమశిక్షణగా ఓటువేయించడం పై ఫలితం ఆధారపడి ఉంటుందంటున్నారు. శ్రీలంక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ‘ప్రజాస్వామ్య రాజ్యాంగ రాజకీయ పరిధిలో’ పరిష్కారాలను కనుగొనాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా, బుధవారం జరిగే ఎన్నికల్లో దుల్లాస్ అలహప్పెరుమ గెలిస్తే, ‘ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ’ రద్దుకు ఆయన అంగీకరిస్తే తదుపరి ప్రధానమంత్రిగా ప్రేమదాస ఎంపిక అవ్వచ్చనే వార్తలు వస్తున్నాయి.
srilanka,president,Sajith Premadasa,withdraws his candidacy,Sri Lanka presidential election,Dullas Allahaperuma