మాజీ మంత్రి కేటీఆర్‌‌పై ఈడీ కేసు

2024-12-20 15:39:12.0

ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది

ఫార్ములా-ఈ కారు రేసులో వ్యవహారంలో కేంద్రానికి చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. ఇందులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజీనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, ఇతర డాక్యుమెంట్ల కాపీలు ఇవ్వాలని ఈడీ నేడు ఏసీబీని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా… విదేశీ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించాలని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి.కాగా, ఏసీబీ నమోదు చేసిన కేసుపై కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 30 వరకు కేటీఆర్ పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది. ఈ క్రమంలో, కేటీఆర్ ఈడీ కేసుపైనా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. కేటీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని కోరారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.

Former Minister KTR,ED,Telangana Assembly,Formula E is car racing,KCR,BRS Party,Harish Rao,CM Revanth reddy,Congress party,KTR,Telangana High Court,ACB,Quash Petition,Arvind Kumar,HMDA Chief Engineer BLN Reddy