మాతృ వందనమ్ (గేయ కవిత)

2023-10-16 08:17:06.0

https://www.teluguglobal.com/h-upload/2023/10/16/841362-matru.webp

వందనాలే తల్లి!

వందనాలే నీకు

అందుకొని దీవెనలు

అందించవే మాకు!

అందుకొని దీవెనలు

అందించవే మాకు!

నీ వలపు కూతులము

నీ కూర్మి కొడుకులము

మాకు నీవే దిక్కు

మమ్మెపుడు మరవకుము!

జీవనదులనే కన్న

దేవతవు నీవుగా

జీవితమ్ములో మధుర

భావనవు నీవెగా!

సురుచిర స్వరముతో

జోలలే పాడేవు

మా మంచి అమ్మవై

మమ్ము కాపాడేవు!

తినిపించెదవు మాకు

దివ్య నైవేద్యములు

వినిపించెదవు మాకు

వేదాంత వేద్యములు!

లేయెండలో నిలిపి

హాయినందించేవు

కలికి వెన్నెలలందు

జలకమాడించేవు!

శాంతి మంత్రమ్ములే

సాగేను నీ నోట

సత్య ధర్మమ్ములే

సవరించు నీ పైట!

నీ పాదములనంటి

నిత్య పూజలు చేసి

రక్షించ వేడెదము

రావే దయారాశి!

వందనాలే తల్లి!

వందనాలే నీకు

అందుకొని దీవెనలు

అందించవే మాకు!

అందుకొని దీవెనలు

అందించవే మాకు!

-ఎన్.ఆర్.తపస్వి

గోవాడ

NR Tapasvi,Telugu Kavithalu