మాలీవుడ్‌లో వేధింపులపై ఉన్నతాధికారులతో కమిటీ

2024-08-26 03:47:50.0

ఆరోపణల నేపథ్యంలో సిద్దిఖీ, రంజిత్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. వీటన్నింటిపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

https://www.teluguglobal.com/h-upload/2024/08/26/1354747-kerala-govt-forms-special-probe-team-over-harassment-charges-in-malayalam-cinema.webp

మాలీవుడ్‌లో నటీమణులు ఎదుర్కొంటున్న వేధింపులు, ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనికితోడు పలువురు నటీమణులు తాము కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నామంటూ ఆరోపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.

ప్రముఖ దర్శకుడు, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్‌ బాలకృష్ణన్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సిద్దిఖీ నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ నటి రేవతి సంపత్‌ కూడా ఆరోపించారు. వారి ఆరోపణల నేపథ్యంలో సిద్దిఖీ, రంజిత్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. వీటన్నింటిపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాజాగా వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ స్పర్జన్‌కుమార్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు.

Kerala govt,Special Probe Team,Harassment,Charges,Malayalam cinema