మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చేయాల్సిందే…

https://www.teluguglobal.com/h-upload/2023/05/20/500x300_767163-healthy-heart.webp
2023-05-20 08:37:08.0

వ్యాయామం ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. అయితే కొన్ని రకాల వ్యాయామాలు ప్రత్యేకంగా గుండెకు మేలు చేస్తాయి.

వ్యాయామం ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. అయితే కొన్ని రకాల వ్యాయామాలు ప్రత్యేకంగా గుండెకు మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు వీటిని చేయటం మంచిది.

♦ నడక గుండెకు చాలా మేలు చేస్తుంది. రోజుకి కనీసం అరగంటపాటు నడవటం వలన తగిన ప్రయోజనం పొందవచ్చు. సాధారణ నడక కాకుండా చేతులను బాగా ఊపుతూ వేగంగా నడవటం వలన గుండె ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది.

♦ స్కిప్పింగ్… అంటే తాడాట కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

♦ స్విమ్మింగ్ వలన కూడా మన గుండెకు నమ్మలేనంతగా ప్రయోజనం కలుగుతుందట. అలాగే సైక్లింగ్ కూడా హార్ట్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది.

♦ మెట్లు ఎక్కడం, పరిగెత్తటం, ఒంటికాలిపైన నిలబడే వ్యాయామం కూడా గుండెకు శక్తిని ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒకకాలిపైన పది నుండి పదిహేను సెకన్లపాటు నిలబడి తరువాత కాలిని మార్చి మరొక కాలిపైన నిలబడాలి. ఈ వ్యాయామం పొట్టకు కూడా మేలు చేస్తుంది.

♦ నిటారుగా నిలబడి మోకాళ్లను వంచకుండా ముందుకి వంగి కాళ్ల వేళ్లను పట్టుకునే వ్యాయామం కూడా గుండెకు ప్రయోజనకరం.

వ్యాయామం గుండెకు ఎలా మేలు చేస్తుందంటే…

♦ వ్యాయామంతో రక్తపోటు తగ్గుతుంది. వ్యాయామం గుండెకొట్టుకునే వేగాన్ని, రక్తపోటుని తగ్గించే మందుల్లాగా పనిచేస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

♦ మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయటం వలన శరీరబరువు నియంత్రణలో ఉంటుంది. శరీర బరువు పెరగటం వలన గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వ్యాయామంతో ఈ ప్రమాదాలను నివారించుకునే అవకాశం ఉంటుంది.

♦ వ్యాయామం గుండె కండరాలను శక్తి మంతం చేస్తుంది. వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్ధ్యాన్ని పెంచుతాయి. బరువులు ఎత్తే వ్యాయామాలు సైతం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ వ్యాయామాల వలన రక్తంలోని ఆక్సిజన్ ని కండరాలు మరింత సమర్ధతతో తీసుకుంటాయి.

♦ సిగరెట్లు గుండె ఆరోగ్యానికి హాని చేస్తాయి. సిగరెట్ పొగ రక్తనాళాల ఆకారాన్ని, వాటి పనితీరుని దెబ్బతీసి గుండె వ్యాధులకు కారణమవుతుంది. సిగరెట్లు తాగేవారు వ్యాయామం చేయటం వలన ఆ అలవాటుని మానగలగుతారు. శారీరకంగా ఫిట్ గా ఉన్నవారు పొగతాగే అలవాటు జోలికి పోకుండా కూడా ఉండగలుగుతారు. –

♦ వాకింగ్ రన్నింగ్ లాంటి వ్యాయామాలకు బరువులు ఎత్తే వ్యాయామాలను సైతం జోడించి చేయటం వలన మధుమేహం వచ్చే ప్రమాదం యాభైశాతం వరకు తగ్గుతుంది. ఆ విధంగా కూడా గుండెకు మేలు కలుగుతుంది.

♦ వ్యాయామం వలన ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి హార్మోన్లు పెరిగితే గుండెకు హాని కలుగుతుంది. వ్యాయామంతో వాటిని నియంత్రించవచ్చు.

♦ వ్యాయామం చేయటం వలన ఎన్నో అనారోగ్యాలకు కారణమయ్యే ఇన్ ఫ్లమేషన్ శరీరంలో పెరగకుండా ఉంటుంది. మంట వాపు లక్షణాలతో కూడిన ఇన్ ఫ్లమేషన్ ని వ్యాయామంతో నివారించవచ్చు. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి రోగకారక క్రిముల వలన గుండెలో ఇన్ ఫ్లమేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివలన గుండె కొట్టుకునే తీరులో క్రమబద్ధత లోపించడం, హార్ట్ ఫెయిల్యూర్, ఇతర గుండెవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక మాదిరి శారీరక శ్రమతో కూడిన ఇరవై నిముషాల వ్యాయామం యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రభావాన్ని చూపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

వ్యాయామం గుండెకు ఎంతో మేలు చేస్తుందన్న మాట నిజమే. అయితే గుండెకు సంబంధించిన సమస్యలు, అనారోగ్యాలతో బాధపడుతున్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

Healthy Heart,Exercise,Health Tips
Exercise for a Healthy Heart, exercise for a strong healthy heart, Exercise, telugu news, telugu news

https://www.teluguglobal.com//health-life-style/exercise-for-a-healthy-heart-934142