2023-03-14 09:46:05.0
https://www.teluguglobal.com/h-upload/2023/03/14/726772-ame.webp
ఎప్పుడూ మీ ఊహల్లో
బతకడమేనా ?
కొన్ని వదిలేయండి..
ఆమె కోసం…
మనసులో గోడలకు వేసుకున్న
సున్నిత రంగు చిత్రాలను
స్పృశించకండి..
వెలసిపోతాయి
గొంతు విప్పిన
మాటల కాఠిన్యానికి
లేని బిరుదులు
తగిలించకండి..
తట్టి చూడండి
హృదయం లోని
ఏ పొరనో
చిరిగిందేమో…!!
పరువపు బిగువు
సడలిందని
కోల్పోయిన అందాన్ని
పరిహసించకండి
మీకోసం చేసిన త్యాగాన్ని
ఆస్వాదించలేరూ
అమ్మతనంలో..
సరిహద్దులు గీసి
బలహీనురాలిని చేయకండి
రాబోయే తరానికి
క్రమశిక్షణ బాధ్యత నెత్తుకున్న
సుశిక్షితురాలిని గుర్తించండి
విషపు పడగలతో
కాటువేయడానికి మాటువేసి
నేరాలు మోపుతూ
నిందితురాలిగా నిలబెట్టడమే
మీకు చేతనవునా !!!
ప్రపంచమంతా తిరిగినా
మీ చుట్టూతా ..
ఏదో రూపంలో
ఎటుచూసినా ఆమే !!
బతగ్గలరా
ఆమెతనాన్ని వీడి?
మీలో చైతన్యం
ఆమె మౌనాన్ని
ధరించినంతవరకే..
అపార్థాలను వీడండి ఇకనైనా ..
మీకు ఊపిరినిచ్చిన తనువు
గాయపడి బెదిరిన పులిలా
వెనుదిరిగి మీ ముంగిటవాలి
పంజా విసరకముందే..!!
– అరుణ ధూళిపాళ
Aruna Dhulipala,Telugu Kavithalu