2025-03-11 08:55:18.0
బాలీవుడ్ ప్రేక్షకులకు ఏమైందని ఆమీర్‌ఖాన్ ను ప్రశ్నించిన జావేద్
ఒకేరకమైన మూస కథలు, యాక్షన్‌తో విసిగిపోయిన హిందీ ప్రేక్షకులకు దక్షిణాది సినిమాలు సరికొత్త వినోదాన్ని పంచుతున్నాయి. అదే సమయంలో ‘స్త్రీ2’ , ‘ఛావా’ వంటి ఒకటి రెండు మెరుపులు తప్ప బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్ చూసి చాలాకాలమే అయింది. తాజాగా జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ అగ్రహీరో ఆమీర్‌ఖాన్‌తో కలిసి సీనియర్ రచయిత జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ఏటా సరికొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా గతంలో పోలిస్తే, హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలకు కనెక్ట్ కాలేకపోతున్నారని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ముక్కూ, ముఖం తెలియని దక్షిణాది హీరోల సినిమాలు ఇక్కడ బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రాబడుతున్నాయన్నారు. ‘బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీ’ వెనకబడుగు వేయడంపై ఆమీర్ అభిప్రాయాన్ని కోరుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పటితో పోలీస్తే, హిందీ మూవీస్ ప్రేక్షకులకు దగ్గర కాలేకపోతున్నాయి. అదే సమయంలో దక్షిణాది సినిమాలు డబ్ అయి ఇక్కడి వారిని అలరిస్తున్నాయి. అసలు హిందీ ప్రేక్షకులకు పరిచయం లేని నటుల సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ. 600-700 కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. మన ప్రేక్షకులకు ఏమైంది అని ఆమీర్‌ఖాన్ ను జావేద్ అడిగారు.
దీనికి ఆమిర్ స్పందిస్తూ.. డైరెక్టర్ల ప్రాంతీయ నేపథ్యం అనేది ఇప్పుడు అప్రస్తుతమని, దక్షిణాది, ఉత్తరాది సినిమాలు అనే విషయం అసలు సమస్యే కాదని అభిప్రాయపడ్డారు. మనం ఎదుర్కొంటున్న సమస్య కాస్త విచిత్రమైంది. అందుకు కారణం బాలీవుడ్ అనుసరిస్తున్న బిజినెస్ మోడల్. ఆర్థికశాస్త్రంలో డిమాండ్ సప్లప్ అనే సూత్రం ఉన్నది. మా సినిమాను దయచేసి చూడండి అని ప్రేక్షకులను అభ్యర్థిస్తాం. ఒకవేళ ప్రేక్షకులు రాకపోతే ఎనిమిది వారాల తర్వాత వాళ్ల ఇంటికే తీసుకెళ్లి ఇస్తాం(ఓటీటీ). ఇది మన వ్యాపార నమూనా. అప్పటికే సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు ఎనిమిది వారాల తర్వాత ఎంచక్కా ఓటీటీలో మూవీ చూస్తారు. ఒకే ఉత్పత్తిని రెండుసార్లు ఎలా అమ్మాలో నాకు తెలియదు. ఒకప్పుడు నాకు వేరే అవకాశం (ఓటీటీ) లేనప్పుడు కచ్చితంగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసేవాడిని. ఇప్పుడు నచ్చితే థియేటర్‌కు వెళ్లడం అలవాటైంది. అంతేకాదు, ఇప్పుడు మనం ఎక్కడి నుంచైనా సినిమా చూడొచ్చు. థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు. మన సొంత బిజినెస్ మోడల్‌తో మన సినిమాలను మనమే చంపుకొంటున్నామని ఆమీర్‌ఖాన్ అభిప్రాయపడ్డారు.
Javed Akhtar wonders,Why south films are dominating,Aamir Khan,Explains bigger issue,Dubbed South Indian films