2022-12-18 09:05:30.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/18/431746-puvu.webp
చిన్న మొక్కకు అతి చిన్న పువ్వు
పూయటం ఎంత సహజమో
ఏ అనుభవము గడించకనే
ప్రేమాభివ్యక్తి మనుషులకు,
పశుపక్షాదులకు అంతే సహజం.
మనిషి హృదయానిది
స్వతహాగా
పూరేకు వంటి మెత్తని స్వభావం.
ప్రేమనేర్వని భాష,
చెప్పని చదువు -లాలన
మనిషి మృదుస్వభావ లక్షణం.
తన శక్తి మేర వెలుగులు విరజిమ్మే
మిణుగురు కాంతులు,
చీకటి తెరలను
సున్నితంగా తాకుతున్నట్లు
కళ్ళు మూసుకుని
తనదైన ప్రపంచంలో
విహరిస్తూ ప్రశాంతంగా
కుసుమ బాల.
గాలి తెమ్మెరలు కూడా
మృదువుగా తాకిపోతున్నట్లు,
కలల ప్రపంచంలో
అలలు రేపకుండా
విస్మృతావస్థలో
నిశ్చల చిరు దీపకళికలా
అదో ధ్యానముద్ర.
మానవేతర శక్తి ఏదో
ప్రపంచాన్ని జో కొడుతున్నట్టు
ఆదమరిచిన సమయంలో
పువ్వొకటి జారిపడినట్లు
ముద్దొకటి ఆ చిన్నారి బుగ్గను తాకింది.
ఇంద్ర ధనుస్సురేఖ ఒకటి
నేలను తాకినట్లు
మనోహర వర్ణ చిత్రమొకటి
గుండె గోడల మీద పెదవుల
కుంచెతో చిత్ర రచన చేసింది.
-మల్లేశ్వర రావు ఆకుల (తిరుపతి)
Malleswara Rao Akula,Telugu Kavithalu