ముల్కీ పోరాటం నుంచి నేటి రాష్ట్ర ఉద్యమం వరకు పుస్తక రూపం తేవాలి

2024-12-24 15:26:43.0

తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కొంపెల్లి యాదవరెడ్డి రాసిన ‘నట్స్‌ అండ్‌ బోల్ట్స్‌ ఆఫ్‌ వార్‌ అండ్‌ పీస్‌’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వ్యాఖ్యలు

యుద్ధం వద్దు-శాంతి ముద్దు అంటూ అఖిల భారత శాంతి, సహృద్భావన సంస్థ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కొంపెల్లి యాదవరెడ్డి రాసిన ‘నట్స్‌ అండ్‌ బోల్ట్స్‌ ఆఫ్‌ వార్‌ అండ్‌ పీస్‌’ పుస్తకాన్ని హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. శాంతిని కాంక్షిస్తూ 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఈ పుస్తకం రాయడం గొప్ప విషయమని సీఎం కొనియాడారు. నేటికీ వర్గాల మధ్య పోరుతో దేశంలో కొన్ని ప్రాంతాలు అట్టుడుకిపోతున్నాయని, అలాంటి చోట శాంతి నెలకొనాలని సీఎం కాంక్షించారు. ముల్కీ రూల్స్‌ పోరాటం నుంచి నేటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రత్యేక పరిణామ ఘట్టాలపై కూడా పుస్తకం తీసుకురావాలని సీఎం కోరారు.

శాతి తనంతట తాను రాదని.. దాని కోసం అందరం కృషి చేయాలని, క్షిపణులు కోసం కాకుండా శాంతి కోసం ఖర్చు చేయాలని యాదవరెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రచ్ఛన్న యుద్ధాలు కూడా శాంతియుతంగానే జరిగాయన్నారు. పార్టీలకు అతీతంగా సీపీఐ,సీపీఎం, కాంగ్రెస్‌,బీఆర్‌ఎస్‌, బీజేపీ నేపథ్యాలున్న పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందేమోననే సంకేతాలు వస్తున్న సమయంలో శాంతిని కాంక్షిస్తూ ఆ పుస్తకం తేవడం ఆహ్వానించదగిన పరిణామమని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి దంపతులను సీఎం సత్కరించారు. 

CM Revanth Reddy,Requested,Mulki Rules struggle,Telangana state movement,Book need Come,’Nuts and Bolts of War and Peace’ Book,Former MLC Yadava Reddy