పెంచిన చార్జీల్లో 30 శాతం తగ్గించాలని నిర్ణయం.. రేపటి నుంచి అమలు
మెట్రో చార్జీలను భారీగా పెంచేసిన సిద్ధరామయ్య సర్కారు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గింది. పెంచిన మెట్రో రైల్ చార్జీల్లో 30 శాతం తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. చార్జీల తగ్గింపు నిర్ణయం 14వ తేదీ (శుక్రవారం) నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశాలతో మెట్రో రైల్ పెంచిన చార్జీలను తగ్గిస్తున్నట్టుగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) ఎండీ మహేశ్వర్ రావు ప్రకటించారు. బెంగళూరు మెట్రో రైళ్లను భారీగా పెంచి ఈనెల 9వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. మెట్రో రైల్ చార్జీల పెంపుపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సిద్ధూ సర్కారును ఏకిపడేశారు. ఢిల్లీ మెట్రోలో 32 కి.మీ.లకు మించి ప్రయాణించే వారి నుంచి రూ.60 వసూలు చేస్తుండగా బెంగళూరు మెట్రో చార్జీని 25 కి.మీ.లు దాటితే రూ.90కి పెంచడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాగ్రహానికి తలవంచిన కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన చార్జీల్లో 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
Bengaluru Metro Rail,Charges Hike,People Protest on Social Media,30 % Charges Reduced,Siddaramaiah Govt