2024-10-11 04:42:38.0
అన్నీ మంచే చేసినా పార్టీ వీడటం బాధాకరమన్న వైసీపీ అధినేత
https://www.teluguglobal.com/h-upload/2024/10/11/1368103-jagan.webp
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదని, ఆయనకు అన్నీ మంచే చేశానని, ఎక్కడా తక్కువ చేయలేదని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా వెంటనే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చాను. మండలిని రద్దు చేద్దామనుకున్నప్పుడు తన పదవి పోతుందని ఆయన అడగగానే రాజ్యసభకు పంపాను. అయినా మోపిదేవి పార్టీని వీడి వెళ్లారని, ఇది బాధాకరమని జగన్ వాపోయారు.
గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రేపల్లె నియోజకవర్గ నేతలతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు రేపల్లె వైసీపీ సమన్వయకర్త గణేష్‌కు మీ మద్దతు చాలా అవసరమని నేతలకు చెప్పారు. ఓట్ల కోసం చంద్రబాబు ప్రతీచోటా అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేశారు. వాలంటీర్లను తీసేయను, వేతనం కూడా రూ. 10 వేలకు పెంచి ఇస్తానని చెప్పి వాళ్లందరినీ దగా చేశారు. ఇంట్లో ఏ వయసు వారికైనా రకరకాల పథకాల కింద డబ్బు ఇస్తామని చెప్పారు. తాను కూడా చంద్రబాబు అబద్ధాలతో పోటీ పడి ఉంటే.. బహుశా సీఎం స్థానంలో ఉండేవాడినేమో! కానీ మీలో ఎవరికైనా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉండేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు. కానీ ఆయన పార్టీ కార్యకర్తలు ఎవరూ ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.