మోహన్‌ బాబుకు రాచకొండ పోలీసుల నోటీసులు

 

2024-12-10 16:45:49.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/10/1384857-mohan-babu.webp

బుధవారం ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని ఆదేశం

నటుడు మోహన్‌ బాబుకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు మంచు విష్ణు, మనోజ్​ లకు నోటీసులు ఇచ్చారు. మోహన్​ బాబుపై ఆయన కుమారుడు మంచు మనోజ్ ఫిర్యాదుతో పాటు జల్‌పల్లిలో మనోజ్‌ తో పాటు మీడియా ప్రతినిధులపై దాడి ఘటనను రాచకొండ పోలీసులు సీరియస్‌ గా తీసుకున్నారు. మీడియాపై మోహన్‌ బాబు దాడి అనంతరం జల్‌పల్లిలోని మోహన్‌ బాబు నివాసం నుంచి ప్రైవేట్‌ సెక్యూరిటీతో పాటు బౌన్సర్లను బయటికి పంపారు. మోహన్‌ బాబు ఇంటికి పోలీసులు భద్రత పెంచారు. దాడి ఘటనపై బుధవారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుకావాలని రాచకొండ సీపీ ఆదేశించారు. మోహన్‌ బాబుతో పాటు విష్ణుకు గతంలో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఇచ్చిన గన్‌ లైసెన్సులతో పాటు గన్స్‌ సరెండర్‌ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. మీడియాపై దాడి అనంతరం మోహన్‌ బాబుకు బీపీ పెరిగి కింద పడిపోయాడు. ఆయన పెద్ద కుమారుడు వెంటనే గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ హాస్పిటల్‌ కు తరలించారు. ఇప్పటికే మనోజ్‌ తల్లి అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మోహన్‌ బాబు కాలికి గాయం అయ్యిందని.. బీపీతో పాటు కాలికి తగిలిన గాయానికి డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారని సమాచారం. తమ కూతురి కోసం జల్‌పల్లిలోని ఇంట్లోకి వెళ్లిన మంచు మనోజ్‌, మౌనిక దంపతులు రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్నారు. కూతురిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారా, మోహన్‌ బాబు ఇంట్లోనే ఉంటారా అనేది తేలాల్సి ఉంది.

 

Mohan Babu,Manchu Manoj,Attack on Media,Rachakonda Police,Manchu Vishnu,Bhuma Mounika