2022-12-31 13:32:24.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/31/433408-new-year.webp
2020 డిసెంబర్ 31 న వ్రాసినది
యో౭పామాయతనం వేదా
ఆయతనవాన్ భవతి
సంవత్సరో వా అపామాయతనం
ఆయతనవాన్ భవతి
యస్సంవత్సరస్యాయతనం వేదా
ఆయతనవాన్ భవతి
అపోవై సంవత్సరస్యాయతనం
ఆయతనవాన్ భవతి
య ఏవంవేద…
పంచభూతాలకీ కాలానికీ ఉన్న అవినాభావ సంబంధం, వాటి పరిజ్ఞాన్ని పరిచయం చేసిన ఈ వేద మంత్రం ధాటిగానే పని చేసినట్టుంది …
ఏడాది లో ఎన్ని మార్పులు
ఎంత నరమేధం
తుమ్మినా … దగ్గినా … కాస్త ఒళ్ళు వెచ్చబడినా
మనుషులు
భయవిహ్వలురయ్యేలా చేసింది
అయినా ఈ మహమ్మారి కాలగర్భంలో కలిసిపోవాలని కోరుకోనిదెవరు
మనుషులందర్నీ మమేకం చేసిందీ మాయరోగం
కలిపి విడదీసింది
విడదీసి కలిపింది
పత్రికల్లో పతాకశీర్షికల్లో
ప్రతీ రోజూ ఇదే వార్త
టీవీలూ, వెబ్ సైట్లూ, సైంటిస్టులూ … సామన్యులూ
డాక్టర్లూ … యాక్టర్లూ
పారిశుధ్య కార్మికులూ
పోలీసులూ, “ప్యారా”మెడిక్స్
వీరు వారని లేదు
అందరూ యాంత్రికంగా
బతుకులీడుస్తున్నారు
ఆఖరికి కాలర్ ట్యూన్ కూడా
“అంబ పలుకు … జగదంబ పలుకు”
అన్నట్టు … దీని సమాచారమే
ముక్కూ మూతీ మూస్కొని
మాస్కూ, శుద్ధి జలం
మనకి మామూలైపోయాయ్
బతుకులు కకావికలైపోయాయ్
అందులోనే ఆపర్చునిటీ
వెతుక్కున్న వాళ్ళు కొందరు
అసహాయులై ఆయువు తీరిన వారు ఇంకొందరూ
అమ్మో జాగ్రత్త అన్నవాళ్ళు కొందరూ
ఆc ఏముందిలే అనుకున్న వాళ్ళు ఇంకొందరూ
ప్రాణాయామం రక్షిస్తుందని కొందరూ
కషాయం కాపాడుతుందని కొందరూ
జరిగేవి జరుగుతున్నాయ్
ఆగేవి ఆగుతున్నాయ్
అవన్నీ జీవితాలే …
ఇంకెన్నాళ్ళో …
బతికి బట్టకట్టిన
ఎందరో మహానుభవులు
పోరాడి ఓడిన జగదానందకారకులూ …
అద్వైత సిద్ధికి
అమరత్వ లబ్ధికి
“ప్రాణమే” సోపానమూ …
మరి గుమ్మం ముందు
నిలబడ్డ కొత్త సంవత్సరం లో
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేదికోరేదీ… వాడినేది అడిగేదీ …
– సాయి శేఖర్
Telugu Kavithalu,Yantrapushpam