యూపీ మెడికల్‌ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల సజీవదహనం

https://www.teluguglobal.com/h-upload/2024/11/16/1378232-fire-in-up.webp

2024-11-16 03:12:33.0

ఉత్తర్‌ప్రదేశ్‌ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలోని నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో వ్యాపించిన మంటలు

యూపీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలోని నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో మంటలు వ్యాపించి పది మంది శిశువులు సజీవ దహనమయ్యారు. భారీగా మంటలు చెలరేగడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బైటికి పరుగులు తీశారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట కూడా చోటుచేసుకున్నది. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

తీవ్రంగా ఇబ్బంది పడుతున్నశిశువులకు ఈ వార్డులో చికిత్స  అందిస్తున్నారు. వీరిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన జరిగిన సమయంలో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బైటికి పరుగెత్తారు. ఆస్పత్రిలో ఉన్న గర్భిణులను వారి బంధువులు క్షేమంగా బైటికి తరలించారు. మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ప్రాంగణమంతా దట్టమైన పొగ వ్యాపించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో చోటు చేసుకున్నది. రాత్రి 10.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని,షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని జిల్లా కలెక్టర్‌ అవినాశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా హాస్పటల్‌కు చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తోంది.

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటన ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేశ్‌ పాఠక్‌, ఆరోగ్య కార్యదర్శి వెంటనే ఝాన్సీకి బయలుదేరి వెళ్లారు.మరోవైపు ఆస్పత్రి ఘటనలో మృతి చెందిన శిశువుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయడిన చిన్నారులకు రూ. 50 వేల పరిహారాన్ని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ప్రకటించారు.

మెడికల్‌ కాలేజీ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ ఘటన హృదవిదారకంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.ఈ దుర్ఘటనను భరించే శక్తిని మృతుల కుటుంబాలకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాన్నట్లు ప్రధాని ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన చిన్నారులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. నవజాత శిశువుల మరణవార్త బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ఎక్స్‌ వేదికగా సంతాపం ప్రకటించారు.

Uttar Pradesh’s Jhansi district,Jhansi medical college fire,10 children die,16 battle for life,Electrical short circuit