రెండు కేసులను కొట్టేయాలని హైకోర్టులో కేటీఆర్‌ పిటిషన్లు దాఖలు

2025-02-21 07:20:14.0

సీఎంను దురుద్దేశపూర్వకంగా అవమానించలేదని.. తన వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లలేదని పిటిషన్లలో పేర్కొన్న కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. బంజారాహిల్స్‌, ముషీరాబాద్‌ పీఎస్‌లలో నమోదైన కేసులు కొట్టేయాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డిని అవమానించారంటూ కాంగ్రెస్‌ కార్యకర్త ఫిర్యాదుతో బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది. బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద సీఎం రూ. 2,500 కోట్లు తీసుకున్నట్లు కేటీఆర్‌ ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్‌ కార్యకర్త బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో బాణసంచా కాల్చినందుకు ముషీరాబాద్‌ పీఎస్‌లో కేటీఆర్‌, ఆపార్టీ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌పై మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులను కొట్టివేయాలని కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి కారణాలు లేకుండా పోలీసులు కేసులు నమోదు చేశారని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. సీఎంను దురుద్దేశపూర్వకంగా అవమానించలేదని.. తన వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లలేదన్నారు. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు మార్చి 18కి వాయిదా వేసింది.

KTR,Filed petitions in the High Court,Strike out both cases,Not insulted maliciously,Law and order Issue