రేణుకాస్వామి ఆత్మ నన్ను వెంటాడుతున్నది

 

2024-10-05 07:39:52.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/05/1366320-darshan.webp

రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయి జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ జైలు అధికారులకు చెప్పినట్లు వార్తలు

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌ అరెస్టై జైలులో ఉన్నాడు. ఈ కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఆయన ప్రస్తుతం బళ్లారి జైలులో కొన్నిరోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలుస్తోంది. రేణుకాస్వామి ఆత్మ తనను వెంటాడుతున్నదని.. కలలోకి వచ్చి భయపెడుతున్నదని, భయంతో తనకు నిద్ర పపట్టడం లేదని ఆయన జైలు అధికారులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని కనుక తనను బెంగళూరు జైలుకు తరలించమని అభ్యర్థించినట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి వేళ దర్శన్‌ నిద్రలో కలవరిస్తున్నాడని, గట్టిగా కేకలు వేస్తున్నాడని తోటి ఖైదీలు చెప్పినట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం విదితమే. అతడిని చిత్రహింసలకు గురిచేసి అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు , కరెంట్‌ షాకులు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో దర్శన్‌, పవిత్ర గౌడ సహా 15 మందిని అరెస్ట్‌ చేశారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్‌ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇటీవల బళ్లారి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేస్తున్నారు. దీనిపై నేడు విచారణ జరగనున్నది. దర్శన్‌ తరఫున సీనియర్‌ సునీల్‌ వాదించనున్నారు. అలాగే ఆయనతీవ్రమైన వెన్ను నొప్పితో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. ఆర్థోపెడిక్‌ సర్వజన్‌ అతడిని పరీక్షించి స్కానింగ్‌ చేయించాలన్నారు. సర్జరీ అవసరమవుతుందని సూచించారు. అందుకే మెరుగైన చికిత్స కోసం తనను బెంగళూరు జైలుకు తరలించాలని ఆయన జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దర్శన్‌కు బెయిల్ మంజూరు చేయడంపై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించడానికి లాయర్‌కు మరింత సమయం ఇస్తూ సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 4 తేదీకి వాయిదా వేసింది.

 

Kannada actor Darshan,Renukaswamy,haunted,spirit,pavithra gowda