రేవంత్‌ బెదిరింపు చర్యలకు భయపడే వారెవరూ లేరు

2024-12-26 06:47:49.0

కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని కేటీఆర్‌ ఆగ్రహం

బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేసిన డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టుచేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటీగా “ఎమర్జెన్సీ”ని ముఖ్యమంత్రి అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. నిర్బంధం, అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కే విఫల యత్నం చేస్తున్నారు.

రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో పూర్తిగా చేతిలెత్తేసి, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎలా నియంత్రించాలనే దానిపైనే సర్వశక్తులు ఒడ్డుతున్నారు.అక్రమంగా అరెస్టుచేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ ను వెంటనే విడుదల చేయాలి. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసే విష సంస్కృతికి చరమగీతం పాడాలని డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్తకాదు, అరెస్టులు అంత కన్నా కాదు.. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడే వారెవరూ లేరు.

KTR Fire on,Congress Govt & Revanth,Over Illegal Arrest of Errolla Srinivas,BRS,Congress Govt Conspiracy