2025-01-02 11:11:39.0
సాగు చేయని భూములకు సాయం లేదు.. కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయం
రైతు భరోసా సాయం కోసం రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. యాసంగి సీజన్ లో కోటి ఎకరాలకు రైతుభరోసా కింద ఎకరానికి రూ.7,500 చొప్పున సాయమందించే అవకాశముంది. ఈనెల 14వ తేదీ నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుభరోసా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత నిర్వహించే కేబినెట్ సమావేశంలో రైతుభరోసా విధివిధానాలు ఖరారు చేయనున్నారు. రైతుభరోసాపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సెక్రటేరియట్ లో సమావేశం అయ్యింది. సాగులో ఉన్న భూములకు సాయం అందజేయాలని సబ్ కమిటీ సిఫార్సు చేయనుంది. ఐటీ చెల్లించేవాళ్లు, పథకం అమలుకు గరిష్ట భూ పరిమితి పెట్టాలనే నిబంధనలు అమలు చేయకపోవడమే మంచిదని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. తుది నిర్ణయం సీఎందే కావడంతో కేబినెట్ భేటీలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. తాము పంట సాగు చేశామని చెప్తూ ఈనెల ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్‌లు తీసుకునే అవకాశముంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా పంటలు సాగు చేసిన భూములను గుర్తిస్తారు. ఏఈవోలు సర్వే చేసి సాగు విస్తీర్ణయాన్ని ఖరారు చేస్తారు.
Raithu Bharosa,Raithu Bandhu,Congress Govt,Cabinet Sub Committee,KCR,Revanth Reddy