రైతు నాగోరావ్‌ ది ప్రభుత్వ హత్యనే

https://www.teluguglobal.com/h-upload/2025/01/18/1395736-jadav-nagorao.webp

2025-01-18 15:09:01.0

రుణమాఫీ కాలేదని బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలే : కేటీఆర్‌

రుణమాఫీ కాక, బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక బ్యాంకులోనే రైతు జాదవ్‌ నాగోరావ్‌ ఆత్మహత్య చేసుకోవడం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం సైదుపూర్‌ కు చెందిన నాగోరావ్‌ బ్యాంకులో ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారంటే లోన్‌ తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు ఎంతలా వేధించారో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతు నాగోరావ్‌ నిండు ప్రాణాన్ని రేవంత్‌ రెడ్డి రుణమాఫీ పేరుతో మోసం చేసి బలిగొన్నాడని మండిపడ్డారు. పదేళ్లు రాజుల్లా బతికిన్న రైతన్నలు ఇందిరమ్మ రాజ్యంలో అవస్థల పాలవుతున్నారని, అరిగోస పడుతున్నారని తెలిపారు. అయినా ఈ ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పడం, రైతు భరోసా ఎగ్గొట్టడంతోనే నాగోరావ్‌ తన ప్రాణం తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాగోరావ్‌ ఆత్మహత్యకు కారణమైన ప్రభుత్వంపై హత్యానేరం నమోదు చేయాలని, ఆయన కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతులు అధైర్య పడొద్దని, ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తామని.. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని సూచించారు.

Farmer Nagorao,Suicide in Bank,Farmers Loan Waiver,Congress Promise,Revanth Reddy,BRS,KTR