2023-04-05 12:30:24.0
https://www.teluguglobal.com/h-upload/2023/04/05/729727-raithe.webp
విత్తు నాటితే
విపత్తు మొలుస్తోంది
నాట్లు వేసి
కాట్లు తినాల్సి వస్తోంది
దున్నితే వెన్ను విరుగుతోంది
రైతు బ్రతుకు ఎందుకిలా దిగజారుతోంది
భూమిని నమ్ముకోవడం కన్నా
అమ్ముకోవడం మేలనిపిస్తోంది
వ్యవసాయం వ్యధప్రాయం కావడానికి
కారణాలు ప్రభుత్వాలే
సంక్షేమం పేరున సంక్షోభం
సృష్టిస్తూ
పండిన పంటకు
గిట్టుబాటు ధరలివ్వక
రుణాల మాఫీ మాటేమోగాని
ప్రాణాలనే బలిగొంటూ
నీరు పోసి పెంచిన చెట్టుకే
ఉరి త్రాడు బిగించుకునే
అసహాయతకు
నెడుతోంది వ్యవస్థ
సాంకేతికతకు ఇచ్చిన ప్రాముఖ్యం
నేలను పండించే రైతు కు యివ్వక
వ్యవసాయం జీవనప్రవృత్తి కాక
అదీ ఓ ఉద్యోగం అనుకున్నంతకాలం
రైతు కూలీ అవుతాడు గాని
భూమికి యజమాని కాలేడు
అన్నదాత ను అవమానించకండి
పుట్లుపుట్లు ధాన్యం పండించే రైతులను ఓట్లుగా చూడకండి
కర్ష కుడే మన ప్రాణదాత
రైతే దేశానికి జీవనగిత
-జింకా వెంకటరావు
( హ్యూస్టన్)
Raithe jeevana datha,Jinka Venkata Rao