లక్షల్లో ధర పలికే యాపిల్ మ్యాంగో గురించి తెలుసా?

https://www.teluguglobal.com/h-upload/2024/06/17/500x300_1337328-miyazaki-mango.webp
2024-06-17 18:44:40.0

మామిడి పండ్లలో ఒక్కో వెరైటీ ఒక్కోరకమైన సైజు, రుచిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా యాపిల్ మ్యాంగో ఇంత ధర పలకడానికి దాని రుచి, రంగు కారణం.

సమ్మర్ వచ్చిందంటే మార్కెట్లో రకరకాల మామిడి పండ్లు దర్శనమిస్తాయి. జూన్, జులై వచ్చేసరికి మామిడి పండ్లలో కొత్త వెరైటీలు వస్తుంటాయి. అయితే మామిడి పండ్లలో అత్యంత ఖరీదైన యాపిల్ మ్యాంగో గురించి తెలుసా? లక్షల్లో ధర పలికే ఈ వెరైటీకి ఎందుకంత ప్రత్యేకత అంటే..

పండ్లలో రారాజుగా పిలిచే మామిడి పండ్లలో చాలా రకాల వెరైటీలున్నాయి. అయితే వీటిలో యాపిల్ మ్యాంగోకి ఉండే ప్రత్యేకత వేరు. ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ మామిడిని ‘మియాజాకీ మ్యాంగో’ అని కూడా అంటారు జపాన్‌కు చెందిన ఈ వెరైటీ మనదేశంలో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది.

మామిడి పండ్లలో ఒక్కో వెరైటీ ఒక్కోరకమైన సైజు, రుచిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా యాపిల్ మ్యాంగో ఇంత ధర పలకడానికి దాని రుచి, రంగు కారణం. యాపిల్ మ్యాంగో యాపిల్ పండు రంగులో ఉంటుంది. మిగతా వెరైటీల కంటే తియ్యగా ఉంటుంది. మచ్చలు లేకుండా పెద్ద సైజులో చూడ్డానికి అందంగా కనిపిస్తుంది.

ఒక్కో యాపిల్ మ్యాంగో పండు సుమారు 350 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ వెరైటీ జపాన్‌లో చాలా పాపులర్. మనదేశంలో కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ మ్యాంగోని సాగు చేస్తారు. మనదేశంలో అత్యంత అరుదుగా పండే మామిడి పండు ఇదే.

 

మియాజాకీ లేదా యాపిల్ మ్యాంగో పెంపకానికి చాలా శ్రద్ధ, నైపుణ్యాలు అవసరం. చల్లని వాతావరణంతో పాటు భూమిలో సారం కూడా ఎక్కువ ఉండాలి. ఇవి ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో పండుతాయి. ఈ పండులో ఎక్కువ రసం ఉంటుంది. ఇది జెల్లీ లాంటి పల్ప్‌ను కలిగి ఉంటుంది. ఈ మామిడి పండుని తొక్కతోనే కలిపి తినొచ్చట. తొక్క ఎంతో పలుచగా ఉంటూ పల్ప్ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.

యాపిల్ మ్యాంగో పండు రుచిలోనే కాదు, పోషకాల్లోనూ టాప్‌లో ఉంటుంది. ఈ రకం మామిడిపండ్లలో విటమిన్–సి, విటమిన్–ఎ, హై షుగర్ కంటెంట్, డైటరీ ఫైబర్‌తో పాటు పొటాషియం, ఐరన్, క్యాల్షియం, జింక్, సెలెనియం, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

Miyazaki Mango,Mango,Japanese,Apple Mango
Japanese Miyazaki Mango, Mango, Japanese, Miyazaki Mango, apple mango

https://www.teluguglobal.com//health-life-style/miyazaki-mango-do-you-know-about-the-apple-mango-that-costs-lakhs-1040802