2022-12-04 14:59:56.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/04/429567-hrk.webp
నిన్ను పట్టుకుని ఇంకా ఇంకా
లోతుల్లోకి వెళ్దామనుకుంటాను
బాగా చిన్ని మనస్సుతో చూసిన
నీ యవ్వనం నుంచి
మొదలవుతాను
తెల్లని ధోవతి చెంగులు
నా బక్క వేళ్ళ మధ్యన
ఎండిన కంపతార మీద ఎగురుతున్న పల్చని ఆకులు
ఇంటికి వచ్చిన మీ నాన్న
పట్నంలో పత్తి అమ్మి తెచ్చిన రాణిరూపాయల్లా
నీ నిడుపాటి కళ్లు రెండే
కొన్ని వేలైనట్లు ఒక భ్రమ
బండి అలా పోతూ పోతూ ఉంటుంది
వందల ఏండ్ల ఇసుకను రాసుకుంటూ బండి గాన్లు
ఎద్దులను నువ్వు అదిలించవు
వాటికి తెలుసు
చేని నుంచి రాబోయే
పచ్చని చొప్ప రుచి
చొప్ప నములుతున్నప్పుడు
ఇంకా పూర్తిగా ఎండని
జొన్న ఒగుళ్ళ తీపి పాట కూడా
వాటికి తెలుసు
అందుకే గిట్టల చప్పుడులో
లయ తప్పని
సంగీతం, దాని ట్రాక్ లో
మెడగంటల గీతం
మీ నాన్నదో వాళ్ళ నాన్నదో
పడ్సాల సుంచు మీది
చీకట్లో ఒక సిరాబుడ్డి,
పక్కన పదునైన చురకత్తిలా
ఒక కలంపుల్ల, తెలియక పారేసిన తాటాకు పుస్తకం
ఆ మూలన ఎందుకు ఉండిందో తెలుసుకోవాలని
ఇంకా ఇంకా
చీకటి లోతుల్లోకి వెళ్ళాలని
బడికి నడిచే దారిలో,
ఇంకా మిగిలున్న అడివిలో
అప్పుడే కురిసిన వానను మోసుకెళ్తున్న వరద వాగులో
ఇంకా ఇంకా
లోతుల్లోకి వెళ్ళాలని ఉంది
సుంచు మీద
సిరాబుడ్డి కలంపుల్ల లేవు
తాటాకులు అంతకు ముందే లేవు, అవి మావి కావని అనుకున్నాం,
మావి కావేమో
ఇక ఎప్పటికీ
నేను లోతుల్లోకి వెళ్లలేనేమో…
(సుంచు=అటక. జొన్న ఒగుళ్లు= జొన్న కర్రల మీది పొడవాటి ఆకులు. )
– హెచ్ ఆర్కే
Telugu Kathalu,Telugu Kavithalu,Telugu Poets,HRK