వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం

2025-01-27 09:51:54.0

44 మార్పుల్లో 14 సవరణలకు గ్రీన్‌ సిగ్నల్‌

https://www.teluguglobal.com/h-upload/2025/01/27/1397987-jpc-waqf.webp

వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదముద్ర వేసింది. జేపీసీలోని విపక్ష ఎంపీలు సహా పలువురు ఎంపీలు డ్రాఫ్ట్‌ బిల్లులో 44 మార్పులు చేయాలని సూచించగా వాటిలో 14 సవరణలకు జేపీసీ ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని జేపీసీ చైర్మన్‌ జగదాంబికా పాల్‌ వెల్లడించారు. ఇటీవల జరిగిన జేపీసీ సమావేశం నుంచి ఎ. రాజా, అసదుద్దీన్‌ ఓవైసీ సహా పది మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం పార్లమెంట్‌ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో సభ్యులు సూచించిన సవరణలపై చర్చించారు. వాటిలో 14 సవరణలు చేయాలని తీర్మానించారు. తాము చేసిన ప్రతిపాదనలను చైర్మన్‌ ఏకపక్షంగా తిరస్కరించి ఎన్‌డీఏ సభ్యులు చేసిన సూచనలను మాత్రమే ఆమోదించారని విపక్ష ఎంపీలు అసహనం వ్యక్తం చేశారు. జేపీసీ ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేయలేదని మండిపడ్డారు. జేపీసీ కాలపరిమితిని మరింత పెంచి సవరణ బిల్లుపై విస్తృతంగా చర్చించాలని సమావేశంలో విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. జేపీసీ చేసిన 14 సవరణ ప్రతిపాదనలపై ఎల్లుండి ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 31న లోక్‌సభకు జేపీసీ తన నివేదిక ఇవ్వనున్నట్టుగా తెలిసింది.

Waqf Amendment Bill,Joint Parlimentary Committee,Approves Bill