వయసు నిర్ధారణకు ఆధార్‌ ప్రామాణికం కాదు: సుప్రీంకోర్టు

2024-10-24 16:45:06.0

స్కూల్‌ రికార్డ్స్‌లో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం

https://www.teluguglobal.com/h-upload/2024/10/24/1372218-supreme-court.webp

వయసు నిర్ధారించడానికి ఆధార్‌ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. దీనికి సంబంధించి పంజాబ్‌-హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. రోడ్డు ప్రమాద బాధితుడికి పరిహారం చెల్లించే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. స్కూల్‌ రికార్డ్స్‌లో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తికి సంబంధించి రూ. 19.35 లక్షల పరిహారం ఇవ్వాలని రోహ్‌తక్‌లోని మోటార్‌ యాక్సిడెంట్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. అనంతరం ఈ కేసు హైకోర్టుకు చేరింది. స్థానిక ట్రైబ్యునల్‌ వయసును తప్పుగా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్న ఉన్నత న్యాయస్థానం.. పరిహారాన్ని రూ. 9.22 లక్షలకు కుదించింది. బాధితుడి ఆధార్‌కార్డు ఆధారంగా వయసు 47 ఏళ్లుగా నిర్ధారించి పరిహారం లెక్కకట్టింది. ఆధార్‌ కార్డు ఆధారంగా వయసును పరిగణనలోకి తీసుకుని హైకోర్టు లెక్కగట్టిందని పేర్కొంటూ బాధిత కుటుంబీకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కూల్‌ రికార్డ్స్‌ ప్రకారం అతని వయసు 45 ఏళ్లు మాత్రమేనని వాదించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేసిన జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. మోటార్‌ యాక్సిడెంట్‌ క్లైయిమ్స్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. యూఐడీఏఐ ఇచ్చిన తాజా సర్క్యులర్‌ ప్రకారం.. ఆధార్‌ కేవలం గుర్తింపు కోసమేనని, పుట్టిన తేదీకి రుజువు కాదన్న విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. 

Aadhaar Card Not Suitable,Proof Of Date Of Birth,Supreme Court,motor accident compensation case