2023-02-16 10:04:43.0
https://www.teluguglobal.com/h-upload/2023/02/16/723413-valapu.webp
ఎదతలుపులు నీ కొరకై
తెరవాలని ఉంది
మనసును ఆకాశంలా
పరవాలని ఉంది
నీ ఊహల ఊయలలో
ఊగి ఊగి అలసినాను
దిగులంతా మేఘంలా
కురవాలని ఉంది
అడుగులడుగుతున్నవి నీ
జాడకొరకు ప్రతి దారిని
గుండె చీల్చి ఆనవాలు
చూపాలని ఉంది
వలపు పరీక్షలకు లేవు
పాఠ్యపుస్తకాలేవీ
నీ చూపులు పాఠాలుగ
చదవాలని ఉంది
వలపు గెలుపు ఆట ఎంత
జటిలమొ కద మోహనా
ప్రాణమొడ్డి నీ మనసును
గెలవాలని ఉంది
– తుమ్మూరి రామమోహనరావు
Telugu Kavithalu,Tummuri Ramamohana Rao