వసివాడని సాహితీ ‘లత’

2022-12-22 13:02:38.0

https://www.teluguglobal.com/h-upload/2022/12/22/432337-veehari.webp

తెన్నేటి జానకీరామకృష్ణ హేమలత – ఇదీ – నవలా రచయిత్రిగా పేరుగడించిన ‘లత’కు తల్లిదండ్రులు పెట్టిన పేరు.

15 నవంబర్ 1932న జన్మించి 10 డిశంబర్ 1997న మరణించారు లత. ఆంధ్రాంగ్ల సాహిత్యాల్ని ఆమె ఇంటివద్దనే చదివింది. విజయవాడ వాస్తవ్యురాలు.

‘నేను 105 నవలలు, 700 రేడియో నాటకాలు, 100 చిన్న కథలు, పది రంగస్థల నాటకాలు, 5 సంపుటాల సాహిత్య వ్యాసాలు, రెండు సంపుటాల విమర్శ, ఒక సంపుటి ‘లత వ్యాసాలు’, ఇంకా ౨౫ చరిత్రకందని ప్రేమకథలు వ్రాశాను’ అని చెప్పుకున్నారామె.

ఈ ప్రేమకథల్లో హైదరాబాద్ ఆరవ నిజాము మీర్ మహ్బూబ్ ఆలీఖాన్ జీవితం ఆధారంగా రాసిన ‘ప్రియతముడు’ కూడా వున్నది.

‘అంతరంగ చిత్రం’ ఆమె స్వీయచరిత్ర. లత దృక్పథం ఎంతో విశాలమైనది. దానివల్లనే ఆమె అత్యంత బాధాకరమైన ఆత్మక్షోభకు గురయింది.

‘ఊహాగానం’తో లత తెలుగు సాహిత్య పాఠకుల్ని ఒక ఊపు ఊపింది. అటు ప్రమదావనం మాలతీచందూర్లా, ‘ఇయంగేహే… ఇల్లిందల సరస్వతీదేవిలా….

ద్రౌవది అంతరంగాన్ని స్త్రీ వ్యక్తిత్వ కోణంలో చిత్రిస్తూ ఆమె రాసిన ‘పాంచాలి’ నవల పారకుల్ని విశేషంగా ఆకర్షించింది.

సంచలననాత్మకంగా ఆమె రాసిన రామాయణ విషవృక్ష ఖండనకి అంతగా పేరు రాకున్నా, సాహితీపరుల సమూహాల్లో చర్చనీయమైంది.

లత ఇతివృత్తాల కేంద్ర బిందువు స్త్రీ. స్త్రీకి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు, స్వీయవ్యక్తిత్వం ఆవశ్యతని ఆమె పునఃపునః ఉద్ఘాటించింది. ఉల్లేఖించింది.

‘గాలి వడగలు-నీటిబుడగలు’ నవలలో వేశ్యల దుర్భర జీవిత చిత్రణ చేశారు. వేశ్యల దైహిక, మానసిక హింసల గురించీ, విటుల ద్వారా వారికి సంక్రమించే గుప్తరోగాల గురించీ నంవేదనాత్మకమైన పాత్ర చిత్రణకి ఆ నవల ఒక దర్పణం.

నవలా రచయిత్రిగా లతకు పేరు తెచ్చిన నవలలు ‘ప్రేమ రాహిత్యంలో స్త్రీ’ ‘వారిజ’, ‘ఎడారి పువ్వులు వంటివి ఉన్నా, ‘పథవిహీన’ ఒక సంకీర్తమైన ఇతివృత్తం, శైలీ, శిల్పాలు కలిగిన నవల.

‘పథవిహీన’లో చాలాపాత్రలూ, ప్రేమలూ, వైఫల్యాలూ, విపరీత పర్యవసానాలూ వస్తాయి. ‘సంధ్యారక్తిమ ఎందరిమీద ప్రసరించినా దానిలో అందం తగ్గిపోదు’ అనే ‘ఫిలాసఫీ’ని నమ్మిన ‘అందం తగ్గిపోదు’ అనే ఫ్రెంచి యువతి కూడా కనిపిస్తుంది. లత ప్రోదిచేయదలచిన భావజాలం ఇదే అనిపిస్తుంది. ఆమె సాహిత్య వ్యక్తిత్వంమీద చలం, శరత్ ప్రభావం గాఢంగా ఉన్నదనిపిస్తుంది. శైలివిషయంలో చలం శైలిని ఆమె జీర్ణించుకున్నది. అలాగే, రచనలో ఆలోచనా ప్రేరకమై, వెంటాడే వాక్యాలు లత నవలల్లో ‘సీరియస్ ‘ పాఠకుడి మెదడుని తినేసే శక్తి కలిగినవనటం అతిశయోక్తి కాబోదు.

భావనలోనూ, భావవ్యక్తీకరణలోనూ ‘వసి ‘వాడని లత ‘నవల’ ‘మోహనవంశి’. సుమారు ౪౮ సంవత్సరాల క్రితం సాహితీపరుల్ని అలరించిన రచన. నిజానికి ‘మోహనవంశి’ – పౌరాణిక, ఐతిహాసిక, కాల్పనిక, ఊహాప్రేరిత… ఇలా… అనేక విశేషణాల్ని తగిలించవలసిన రచన! ఈ నవలలో రాధాకృష్ణ తత్త్వం అర్థం పరమార్థం కథనాత్మకంగా వచ్చింది. అదొక ఉన్మత్త భావఝరి. పాత్రలు కొన్ని కల్పితాలు,కొన్ని ఇతిహాసికాలు. లత మహెూద్విగ్నతతో ఉద్రిక్తతతో, ఉద్వేగంతో, ఉన్మత్తతతో రాసిన నవల ఇది.

“నా ఆశలకి, ఆశయాలకీ, ఆత్మానందానికి అధిపతి నా వంశి. శరీరంతో అతనికి దగ్గరవటం అసంభవం కనుక ఆత్మతో అతని పాదాల దగ్గర వాలే మరో ప్రయత్నం మోహనవంశి. ఇది నేను రాధగా వ్రాశాను “

‘బ్రతకమని నాకు నిర్ణయించిన కాలంలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినై. ఏమి జరిగింది? ఏం మిగుల్చుకోగలిగాను? అని మొన్నటివరకు బాధపడ్డాను. ఇక ఇప్పుడా బాధలేదు. నా చైతన్య అంతర్యాలు మోహనవంశిలో నిలిచే ఉంటాయి. మరుక్షణంలో పిలుపు వచ్చినా సర్దుకోవాల్సింది ‘ఏం లేదు’. ఇదీ ఆమె హృద్దర్శనం.

ఆం.ప్ర.సాహిత్య అకాడెమీలో ఆమె 20 ఏళ్లు సభ్యురాలు. నేను 1972-77లో సభ్యుడిగా వున్నాను.

ఆ సమావేశాల్లో కూడా లత ఒక సంచలనం. ‘వచ్చావా తల్లీ…’ అనేవారు అధ్యక్షులు గోపాలరెడ్డిగారు ఈమెని చూడగానే. అలాగే ఆమె ప్రశ్నపరంపరలకీ- ‘నువ్వు కూచో లతా…. నాకు అర్థమైంది నీ ప్రశ్న’ అని చెణుకులతో సాగించేవారు సమావేశాన్ని.

విజయవాడలో తరచుగానే మా బృందం (పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఆదివిష్ణు, విహారి శాలివాహన, హవిస్ , జి.వి.పూర్ణచంద్, ప్రభృతులు) ఆమెను కలుస్తూవుండేది. సభలూ సమావేశాలూ సరేసరి. వక్తగా ఆమె విషయ ప్రస్తావన చాలా నిశితంగా పరిశోధనాత్మకంగావుండేది. ఆమెకు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సాహిత్య గురుస్థానీయుడు. అలవోకగా ఆయన కావ్యాల్లోని పద్యాలు చదివేది.

ఆమె జీవితమంతా కష్టాలూ కన్నీళ్లూ… సంక్లిష్టమైన అనుభవాలు… సున్నితమైనమనను. మాట పెళుసు అనరాదుగానీ స్పష్టం, సూటిదనం ఎక్కువ. సాహిత్య ధోరణులు, పరిస్థితుల గురించి మాట్లాడేటప్పుడు ‘యుధార్థవాది’. అందుకనే ఆమె సన్నిహితుల్లో చాలా మందికి ‘బంధువిరోధి’.

అంతరంతరాల్లో వారికి ఆమె చెప్పింది, చెప్పేది నిజమనే వాస్తవం తెలుసు! ‘లత నవలలు వివాహం విధించిన ఆంక్షలను ధిక్కరించి జీవితంలో అపజయం పాలయ్యారనుకునే

స్త్రీల పట్ల సానుభూతిని కలిగిస్తాయి. ఆధునిక కాలంలో కొత్తగా దొరికిన అవకాశాలను, స్వేచ్ఛనూ ఏం చేసుకోవాలో అర్థంకాక, తమ జీవిత లక్ష్యం ఏమిటో తేల్చుకోలేక సంఘర్షణ వడే స్త్రీ పాత్రలను లతసృష్టించారు’ అన్నారు ఓల్గా. లత వ్యక్తిగత జీవితాన్ని సన్నిహితంగా చూసిన వారికి లత సృష్టించిన స్త్రీ పాత్రల్లో లతే జీవించిందన్న బాధాకర సన్నివేశాలూ, సందర్భాలూ గుర్తుకొస్తూ ఉంటాయి. సంఘంలో స్త్రీ ప్రతిపత్తి గురించి ఆమె అనుభవించిన బహిరంతరణ సంఘర్షణ, సంవేదన వాస్తవంలో ఒక విషాదానుభవమే!

‘నాకు జీవితం ఒక నిజం. ఒక యధార్థం. ఆ నిజాన్ని చిత్రించడానికి నా కలం ఒక బ్రష్’ అని ప్రకటించుకున్నారామె. ఆ నిబద్ధతతో మాత్రమే గాక, నిమగ్నతతోనూ కూడా బతికి ‘పోయారు’ లత! ఆమె సాహిత్య చిరంజీవి!

– విహారి

Telugu Kathalu,Telugu Poets,Vihari