2022-12-24 09:55:50.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/24/432563-he-come.webp
ఆడుకొంటూ వోలకబోసుకొన్న
బాల్యాన్ని ఏరుకోవడానికి
వాడు అపుడప్పుడొస్తాడు…
చేనుగట్టు కాలువగట్టు రహస్యంగా
మాట్లాడిన మూగమాటలు వినడానికి
వాడు… అపుడప్పుడొస్తాడు.
అల్లంతదూరాన
తూరుపుతల్లి ఒడిలో
పసిగుడ్డు ఏడుపు విందామని
మాపల్లెకు వాడు అపుడప్పుడొస్తాడు..
సాయం సంధ్యలో గూడుచేరే
గువ్వలజంట రెక్కలకుకట్టుకొన్న
గుబులుతనాన్ని చూడడానికి
వాడు అపుడప్పుడొస్తాడు…
రాత్రంతా పొగబండిలో
ఉడికి పోయి
పరవసించే పల్లెతనపు
ఈ నందనవనాన్ని
వెంటతీసుకెళదామని ….
వాడు అపుడప్పుడొస్తాడు
ఎన్నాళ్లయినా ఆ రాతిగదుల్లో
ఒంటరితనాన్ని వీడి
ఈ అలల్లో ఓలలాడే
పడవపాటకోసం
తలారా స్నానం చేయాలని
మా పల్లెకు వాడు.. అపుడప్పుడొస్తాడు
వెన్నెల పందిరికింద మౌనమేలే
అవని పొదల మాటున దాగిన
నిశ్శబ్దం విందామని వాడు..
అపుడప్పుడొస్తాడు…
గుర్తునొకటిని ఊరిపొలిమేర గుమ్మానికి
వేలాడదీసిన జ్ఞాపకం కోసం అపుడప్పుడొస్తాడు
తరాలుదాటిన తన తరంకోసం
ఇరుగుపొరుగు ఉనికి కోసం
వదిలెళ్లిన ఇల్లువాకిలి
ఆనవాళ్ళకోసం
వాడు.. అపుడప్పుడొస్తాడు
అత్తరద్దిన పువ్వులమీద అతికించుకొన్న
రెక్కలపిట్టలువాలే
ఈ నగరచెట్టును వీడి
నా… పల్లెకు
వాడు… అపుడప్పుడొస్తాడు.
అపుడప్పుడొస్తుంటాడు.
– బత్తిన కృష్ణ
Bathina Krishna,Telugu Kavithalu