వాణిజ్య టీ బ్యాగులతో లక్షల సంఖ్యలో నానోప్లాస్టిక్‌ విడుదల

బార్సిలోనా యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించిన సంచలన విషయాలు
2024-12-24 04:09:46.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/24/1388572-tea-bags.webp

వాణిజ్య టీ బ్యాగుల వినియోగం కారణంగా లక్షల సంఖ్యలో నానోప్లాస్టిక్‌ విడుదలవుతున్న తీరు స్పానిష్‌ సైంటిస్టులు వెలుగులోకి తెచ్చారు. ఇవి మానవ పేగు కణాల్లోకి చొచ్చుకుపోయి, తద్వారా రక్తప్రవాహంలో కలిసిపోయి, శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉన్నదని తేల్చారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల కాలుష్యం పర్యావరణానికి పెద్ద సవాల్‌గా మారింది. భవిష్యత్తు తరాల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉన్నది. మైక్రో, నానో ప్లాస్టిక్‌ కాలుష్యానికి ఆహార ప్యాకింగ్‌ ప్రధాన కారణం. శ్వాస, ఆహారం ద్వారా ఇవి మనుషుల్లోకి వెళుతుంటాయి. ఈ నేపథ్యంలో బార్సిలోనా యూనివర్సిటీ సైంటిస్టులు వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న పలురకాల టీ బ్యాగుల్లోని సూక్ష్మ, నానో ప్లాస్టిక్‌ల తీరుతెన్నులను పరిశీలించారు. నైలాన్‌-6, పాలీప్రొపలీన్‌, సెల్యులోజ్‌ వంటి పాలీమర్లతో తయారైన కొన్ని టీ బ్యాగులపై పరిశోధనలు చేశారు. వీటి సాయంతో టీ కలిపేటప్పుడు భారీ స్థాయిలో నానో రేణువులు, పోగులు విడుదలైనట్లు గుర్తించారు. పాలీప్రొపలీన్‌.. మిల్లీలీటర్‌కు 120 కోట్ల రేణువులను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో రేణువు పరిమాణం సరాసరిన 136.7 నానోమీటర్లుగా ఉన్నది. సెల్యులోజ్‌ ద్వారా మిల్లీలీటర్‌కు 13.5 కోట్ల రేణువులు, నైలాన్‌-6 ద్వారా 81.8 రేణువులు వెలువడుతున్నట్లు గుర్తించారు.

ఈ ప్లాస్టిక్‌ రేణువులు మానవుల్లోని భిన్నరకాల పేగు కణాల్లో ఉంచి పరిశీలించారు. వీటిలో మ్యూకస్‌ను ఉత్పత్తి చేసే కణాలు.. స్మూక్ష్మ, నానో ప్లాస్టిక్‌లను ఎక్కువగా శోషించుకుంటున్నట్లు తేలింది. అవి జన్యు పదార్థం ఉండే కణ కేంద్రంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడైంది. దీనివల్ల మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలంలో పడే ప్రభావాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని సైంటిస్టులు తెలిపారు.

Tea bags release,Millions of plastic particles,During brewing,scientists at Universitat Autònoma de Barcelona,Polymer-based tea bags,Release,Microplastics and nanoplastics