2022-11-27 07:47:52.0
https://www.teluguglobal.com/h-upload/2022/11/27/428250-varevaa.webp
ఏ నామజపాన్ని
ఎవ్వరు చేశారో ఎప్పుడు చేశారో
తెలుసా నీకు
ఎవ్వరు ఎత్తుకున్న జెండాని
ఎలా నేశారో ఎందుకు నేశారో
ఎరుగుదువా నువ్వు
నువ్వంతా
సూడో మేధావివి
చేతులు కార్చిన నెత్తురుకు
కత్తుల్ని కారణమనే అపర కారుణ్యమూర్తివి
నీదంతా అభినవచాణిక్య నీతి
తలలు తెగ్గొట్టుకున్న న్యాయాన్ని
కాళ్లతో నడిపించమనే ప్రహేళికా దీప్తి
వద్దు వద్దంటావు
వాదోపవాదాల నిజాలు
నిర్భయాలు నిర్భీతులు
తిరిగి తిరిగి
అక్కడికక్కడే మునగదీసుకు కూర్చుంటావు
సంక్లిష్టతల మధ్యలో వెలిగి ఆరిన బొగ్గు కణికలా మారేందుకు
బూడిదై మిగిలిపోయేందుకు
నిజానికి నువ్వే ఓ భ్రమవి
ఇంకేదో విభ్రమను కనిపెట్టేందుకు తపన పడుతుంటావ్
నిక్కచ్చిగా నువ్వో తురాయివి
వజ్రకిరీట పోటీలో నలిగిపోతుంటావ్
సిసలు రంగును పోగొట్టుకుంటుంటావ్….
– సుధామురళి
Telugu Kathalu,Telugu Kavithalu,Telugu Poets,Varevva,Sudha Murali