కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఇన్‌స్టాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ కలకలం రేపుతున్నది.
కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కరీంగనర్ పర్యటనలో తోపులాట ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్ తన ఇన్‌స్టాలో నేను మహిళను. సందర్భానికి తగినట్టు ఉంటాను. మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, గడ్డకట్టిపోగలను, అవసరమైతే కరిగిపోగలను’ అంటూ ఆంగ్లంలో పోస్ట్ చేశారు. ఈ పోస్టు కొన్ని నిమిషాల్లోనే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులపై వ్యక్తంచేసిన ఆగ్రహం, మందలించేందుకు వాడిన పదాలు కలెక్టర్ పమేలా సత్పతిని బాధించాయని.. ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
మంత్రి బహిరంగంగా కలెక్టర్‌ను అవమానకర రీతిలో మాట్లాడారంటూ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడక్కడ తోసుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీపీ మహంతి ప్రొటోకాల్ పాటించలేదని మంత్రులు చిన్న బుచ్చుకున్నారు. బీజేపీ నాయకులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో తోపులాట జరిగి.. ఓ గన్‌మన్ మంత్రి పొంగులేటిపై పదే పదే పడడంతో ఆగ్రహించారు. ఆగ్రహించిన పొంగులేటి.. ‘వాట్స్ దిస్. కామన్ సెన్స్ ఉందా? ఎక్కడ మీ ఏసీపీ? ఎక్కడ సీపీ? అని కలెక్టర్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏర్పాట్ల విషయంలో కలెక్టర్ ఎంత జాగ్రత్తగా ఉన్నా మంత్రి అసంతృప్తి, ఆగ్రహంతో మాట్లాడిన మాటలు ఆమెను బాధించాయని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. మహిళా కలెక్టర్ అని కూడా చూడకుండా మంత్రి పొంగులేటి మాటలు సర్వత్రా విమర్శలకు దారి తీస్తున్నాయి.ఈ ఘటనపై తాజాగా ఆరుగురు అధికారులకు మెమో జారీ చేశారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ టౌన్ ఏసిపి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, .. జిల్లా సంక్షేమ అధికారి, డిఈవో, డిఆర్డీవో లను సంజాయిషీ కోరుతూ మేమోలు జారీ చేశారు
Minister Ponguleti Srinivas Reddy,Collector Pamela Satpathy,Union Minister Manoharlal,Bakka Judson,Bandi Sanjay,Karinganer tour,CP Mahanty,protocol