విభజన అంశాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలి : కేంద్ర హోంశాఖ

2025-02-03 16:06:55.0

కేంద్ర హోంశాఖ కార్యాలయంలో తెలంగాణ, ఏపీ అధికారులు భేటీ అయ్యారు.

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ భేటీ ముగిసింది. 2014లో రాష్ట్ర విభజన జరిగినా కొన్ని ముఖ్యమైన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. దాదాపు రెండేళ్ల తర్వాత విభజన చట్టం అమలుపై హోంశాఖ లోతుగా సమీక్షించింది. సమన్వయంతో ఇరు రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకోవాలని హోంశాఖ సూచించింది. రెండు రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు మద్దతు ఉంటుందని తెలిపింది. నిధుల పంపకాల్లో సమస్యలపై సానుకూల దృక్పథంతో ఉండాలని హోంశాఖ సూచించింది. తమకే ఎక్కువ కావాలని పట్టుబడితే ఇద్దరికీ నష్టం వస్తుందని చెప్పినట్టు సమాచారం. 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విషయంలో న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు.

తదుపరి భేటీలో ఒక నిర్ణయం తీసుకుందామని హోంశాఖ కార్యదర్శి చెప్పినట్టు తెలిసింది.అదే సమయంలో సంస్థల విభజన, ఆస్తులు, అప్పుల పంపకాలపై కీలక సూచనలతో పాటు 9, 10 షెడ్యూల్‌లోని 20 సంస్థల నిధుల పంపకంపై సానుకూలంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తున్నది. ఉన్నతాధికారుల స్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని సూచించారని.. అధికారుల స్థాయిలో కాకుంటే ప్రభుత్వ అధినేతలతో చర్చించి కొలిక్కి తేవాలని చెప్పినట్లుగా టాక్‌. ఎక్కువ వాటాకు పట్టుబడితే ఇద్దరికీ నష్టమని హితవుపలకాలని.. అభిప్రాయ భేదాలతో కోర్టులకు వెళ్తే ఏం జరుగుతుందో చెప్పలేమన్నట్లుగా కేంద్ర కార్యదర్శి అన్నట్లు తెలిసింది. కోర్టుకు వెళ్తే తాను ఏమీ చేయలేమని.. కేసు ఎప్పటికి తేలుతుందో చెప్పలేమనట్లుగా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసిందని సమాచారం. 

Issues of division of states,Central Home Ministry,Govind Mohan,CM Revanth reddy,Telangana goverment,TDP,CM Chandrababu,AP Govement